దారులన్నీ విశాఖ వైపునకు పరుగులు తీస్తున్నాయి. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఉద్యమ కెరటాలై దూసుకొస్తున్నాయి. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ రణన్నినాదం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం సాగిస్తున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘జై ఆంధ్రప్రదేశ్’ బహిరంగ సభకు విశాఖపట్నం సర్వసన్నద్ధమైంది. సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఎన్నికల్లోఈస్టేడియం వేదికగానే బీజేపీ, టీడీపీ నేత లు ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని నరేంద్ర మోదీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఇదే వేదికపై నమ్మబలికారు.