అల్పపీడనం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నమెున్నటి దాకా కరువుతో అల్లాడిన జిల్లాలో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు నిండి మత్తళ్లు దుముకుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో సగటున 3.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. హుస్నాబాద్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సైదాపూర్ మండలంలో 15.8 సెంటీమీటర్లు, హుస్నాబాద్‌లో 15, భీమదేవరపల్లిలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. శుక్రవారం సాయంత్రం నుంచి వర్షం జోరందుకుంది. హుస్నాబాద్, కమలాపూర్, కరీంనగర్‌తోపాటు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 20టీఎంసీల గరిష్ట నీటిమట్టం ఉండగా, భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి గోదావరినదిలోకి నీటిని వదిలారు. రాత్రివరకు ఇన్‌ఫ్లో 23,806 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 8,382 క్యూసెక్కులుగా ఉంది. మోయతుమ్మద వాగుతో పాటు ఎల్లమ్మవాగు, మూలవాగు, ఈదుల వాగులు పొంగిపొర్లుతున్నాయి. మోయతుమ్మదవాగు నిండుగా ప్రవహిస్తుండటంతో కోహెడ మండలం బస్వాపూర్ వద్ద హుస్నాబాద్–సిద్దిపేట మధ్య రాకపోకలు బందయ్యాయి. 24 టీఎంసీల సామర్థ్యం ఎల్‌ఎండీలో ప్రస్తుతం 6టీఎంసీల నీళ్లుండగా, వాగుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.