అవినీతి సీఎంను కేంద్రం కాపాడకపోవచ్చు: వైఎస్ జగన్ | centre-may-not-protect-corrupt-chief-minister-says-ys-jagan-mohan-reddy | Sakshi
Sakshi News home page

Jun 11 2015 6:19 PM | Updated on Mar 22 2024 11:06 AM

అవినీతి ముఖ్యమంత్రిని కేంద్రప్రభుత్వం కాపాడుతుందని తాను భావించడం లేదని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఢిల్లీలో కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు నాయుడిని ఎ-1 ముద్దాయిగా చేర్చాలని వైఎస్ జగన్ డిమాండు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అవినీతికి పాల్పడిన డబ్బుతో తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఆడియో, వీడియో టేపులు ఇప్పటికే బయటకు వచ్చాయని గుర్తుచేశారు. రేవంత్ కేసులో చంద్రబాబును ఎ-1 ముద్దాయిగా ఎందుకు చేర్చడం లేదని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఏడాది పాలనలో చంద్రబాబు చేసిన అవినీతిపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరినట్లు వైఎస్ జగన్ చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు టీడీపీ, కాంగ్రెస్ కుట్రపూరితంగా చేసినవేనన్నారు. ఆ సమయంలో తాను సీఎం, ఎంపీ.. చివరకు ఎమ్మెల్యేగా కూడా లేనని తెలిపారు. తాను సచివాలయంలో అడుగుపెట్టలేదని, ఏ అధికారికీ ఫోన్లు కూడా చేయలేదని అన్నారు. అయినా తనపై వచ్చిన ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొన్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఆయన ఏమన్నారంటే... ''రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక హోదా, విభజన సమయంలో ఇచ్చిన హామీల మీద కేంద్రం నుంచి సహాయం కోసం ఒక కాపీ ఇచ్చాం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏరకంగా టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడో, వాస్తవాలను పక్కదోవ పట్టిస్తున్నాడో అవి హోం మంత్రికి వివరించాము. ఒక ముఖ్యమంత్రి తాను తీసుకున్న లంచాలను విచ్చలవిడిగా ఖర్చుపెడుతూ, లంచం ఇస్తూ దొరికిపోయిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని చంద్రబాబు నాయుడు పక్కదారి పట్టించేందుకు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రే డబ్బులిస్తూ పట్టుబడితే తాను లంచాలుగా సేకరించిన డబ్బును ఇన్ని వందల కోట్లతో ముడిపడిన మొత్తాన్ని లంచంగా ఇస్తూ పట్టుబడితే ఆయనమీద ఎందుకు కేసు పెట్టడం లేదని అడిగాము. కేవలం ఆయన ఒక సీఎం కాబట్టే ఆయన్ను వదిలేయడం ఎంతవరకు ధర్మం అని ప్రశ్నించాము. సామాన్యుడికి ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయం ఎంతవరకు ధర్మం, చంద్రబాబును కచ్చితంగా ఎ-1గా బుక్ చేయాలని హోం మంత్రిని అడిగాము. గత 12 నెలలుగా చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రంలో ఏవేం స్కాములు చేశారో, అవన్నీ కూడా తెలిపాము. పట్టిసీమ, జీవో నెం. 22, డిస్టిలరీలకు అనుమతులు, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్టులో మెగావాట్కు 8 కోట్లు ఇవ్వడం లాంటివాటిపై లోతైన విచారణ జరగాలని కోరాము. నాకు తెలిసి కేంద్రం ఒక అవినీతిపరుడైన ముఖ్యమంత్రిని కాపాడే ప్రయత్నం చేయదని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. కేంద్రం తగు రీతిలో స్పందిస్తుందనే ఆశిస్తున్నాను.''

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement