ఉత్తరప్రదేశ్ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఒకే విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. యూపీలో తాజా విడతలో 65 శాతం పోలింగ్, ఉత్తరాఖండ్‌లో రికార్డు స్థాయిలో 68 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలోని బిజ్నోర్, మొరాదాబాద్, రాంపూర్, బరేలీ తదితర 11 జిల్లాల్లోని 67 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రి, ఎస్పీ నేత ఆజం ఖాన్, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద సహా మొత్తం 721 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ తల్లి కాజ్మీ(115) కుటుంబ సభ్యులతో కలసి బరేలీలో ఓటు వేశారు. ఈ నెల 11న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.2 శాతం పోలింగ్ నమోదైంది.