● టీచర్ల స్థలాలు కొట్టేసే పన్నాగం | - | Sakshi
Sakshi News home page

● టీచర్ల స్థలాలు కొట్టేసే పన్నాగం

May 3 2026 7:29 AM | Updated on May 3 2026 7:29 AM

● టీచర్ల స్థలాలు కొట్టేసే పన్నాగం

సాక్షి ప్రతినిధి, కడప: ‘మీకు అండగా మేముంటాం. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. న్యాయం చేస్తాం. మహానాడు నిర్వహణకు అడ్డుచెప్పొద్దు’.. సరిగ్గా ఏడాది క్రితం టీచర్స్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ నేతలతో తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు అన్న మాటలివి. ఆపై సీఎం చంద్రబాబుతో హామీ ఇప్పించారు. శాలువాలతో సన్మానం చేయించారు. స్వయంగా కలెక్టర్‌ పర్యవేక్షించి టీచర్లకు ప్లాట్స్‌ కేటాయిస్తారని చెప్పుకొచ్చారు. ఇంత చెప్పినా టీచర్లు హైరానా పడ్డారు. ఏడాది గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. అయ్యవార్లు కుయ్యో.. మొర్రో ప్లాట్స్‌ అప్పగించండంటూ వేడుకుంటున్నా కనికరం చూపెట్టడం లేదు. హామీ ఇచ్చిన కలెక్టర్‌ పట్టించుకోవడమే మానేశారు.

● 1989లో టీచర్స్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ 88 ఎకరాలు కడప రూరల్‌ పబ్బాపురం గ్రామ పరిధిలో కొనుగోలు చేసింది. అందులో 1430 మంది ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలు కేటాయించారు. అప్పట్లో ఆ భూమి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు.. కాలక్రమేపి రింగ్‌రోడ్డు అందుబాటులోకి రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత 2006లో తమ సమ్మతి లేకుండా కొనుగోలు చేశారని శోత్రియందారులు కొందరు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నకిలీ రైత్వారీ పట్టాలు పుట్టుకొచ్చాయి. వెబ్‌ ల్యాండ్‌లో లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్‌ తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యను పరిష్కరిస్తామని తెలుగు తమ్ముళ్లు నమ్మబలికారు. సరిగ్గా గత ఏడాది ఇదే మే నెలలో హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ప్రతినిధులతో సమావేశమై ఆ స్థలంలో మహానాడు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. అప్పటికే ఏర్పాటు చేసుకున్న ప్లాట్స్‌ నంబర్‌ రాళ్లు తొలగించి చదును చేసి చక్కబెట్టుకున్నారు.

టీచర్ల పట్ల లోపించిన చిత్తశుద్ధి

టీచర్స్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ కొనుగోలు చేసిన భూమిని చేజిక్కించుకోవాలని కొందరు అక్రమార్కులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో దౌర్జన్యం చేస్తున్నారు. ఇది వరకూ అనేక పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి అయ్యవార్లు తీసుకెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించినా టీచర్లకు దశాబ్దాల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అవే స్థలాలపై తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుండటంతో వ్యవహారం మరింత జఠిలమైంది. అప్పటి వరకూ ఉన్న టీచర్స్‌ ప్లాట్స్‌ రాళ్లు, హద్దులు చెరిపేశారు. యథావిధిగా టీచర్స్‌ ప్లాట్స్‌ అప్పగిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లా కలెక్టర్‌ వరకూ అందరూ హామీ ఇచ్చారు. సమస్య పరిష్కరించి టీచర్లకు ప్లాట్స్‌ అప్పగించడంలో తెలుగు తమ్ముళ్లకు చిత్తశుద్ధి లోపించింది. మహానాడు నిర్వహణకు సహకారం కోసం అనేక మాటలు చెప్పిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు దాటవేస్తున్నారు.

హద్దులు చెరిపేసి మహానాడు నిర్వహణ

ఏడాది అవుతున్నా పరిష్కారానికి నోచుకోని సమస్య

సీఎం హామీ ఇచ్చినా నెరవేర్చని వైనం

ఆందోళనలో అయ్యవార్లు

టీచర్లు హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ, శోత్రియందారుల మధ్య ఉన్న విభేదాలు ఆసరాగా చేసుకొని తెలుగు తమ్ముళ్లు కొంత స్థలాన్ని కొట్టేసే పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. 35 ఏళ్ల క్రితం కేటాయించిన స్థలాల్లో తగ్గించి కొత్తగా ప్లాట్స్‌ వేసుకోవాలని సూచిస్తున్నట్లు సమాచారం. కోర్టు ఉత్తర్వులను సైతం పరిగణనలోకి తీసుకోకుండా చెప్పినట్లు వింటే సరే, లేదంటే మీ ఇష్టం అన్నట్లుగా టీచర్ల ప్రతినిధులతో వ్యాఖ్యానించినట్లు సమాచారం. నాడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సన్మానం చేయించిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు వితండవాదం చేస్తున్నారని పలువురు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement