ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేకువ జామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, బిల్వార్చన, రాజరాజేశ్వరికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. దీక్షా మంటప పూజలు, గణపతి, నవగ్రహ, రుద్రహోమం, దీక్షాహోమాలను వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. వసంతోత్సవంలో భాగంగా స్వామి, అమ్మవార్లకు త్రిశూల స్నానం నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం గంగాగౌరి సమేత అగస్త్యేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై కొలువుదీర్చి ఊరేగించారు. స్వామి వారిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.


