బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి శుక్రవారం తిరుపతికి చెందిన గిన్నెల హరిగోపాల్ ధర్మపత్ని లక్ష్మిదేవి రూ.5లక్షలు నగదు విరాళమిచ్చారు. ఇందులో మాస కల్యాణానికి రూ.3లక్షలు, నిత్యాన్నదానానికి రూ.50వేలు, శాశ్వత పూజకు రూ.1.50లక్షలు విరాళంగా అందించారు. దేవస్థానం మేనేజర్ ఈశ్వరాచారి, సిబ్బంది వీరం బొట్లయ్య, గోపాల్ పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 2,9 తేదీల్లో జరగాల్సి న డిగ్రీ 2,3,4,5 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల విభాగ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. కొన్ని రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు ఉన్న దృష్ట్యా విద్యార్థుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 2వ తేదీన జరగాల్సిన పరీక్ష 19న, 9వ తేదీన జరగాల్సిన పరీక్ష 20వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.
కడప సెవెన్ రోడ్స్: జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా సి. సుబ్రమణ్యం శుక్రవారం బా ధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు సీఈవోగా ఉన్న రామచంద్రారెడ్డి రిటైర్డ్ కావడంతో డిప్యూటీ సీఈవోగా ఉన్న సుబ్రమణ్యానికి సీఈవోగా పదోన్నతి కల్పించారు. ఆయనను జెడ్పీ ఉద్యోగులు అభినందించారు.
వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు 2026– 27 విద్యా సంవత్సరానికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో అడ్మిషన్లు పొందేందుకు అధికారులు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 1 నుంచి 30 తేదీ వరకు నెల రోజులపాటు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలిపారు. పదవ తరగతిలో వచ్చిన మార్కులు ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులకు నూజివీడు, ఇడుపులపాయ(ఆర్కేవ్యాలీ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు.
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శుక్రవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 గంటల నుంచి సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలలోని భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రావన్ కుమార్, పవన్ కుమార్, ఆలయ టీటీడీ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు.
బి.కొత్తకోట: రాజంపేట డీఎఫ్‌ఓ జగన్నాఽథ్‌సింగ్ శుక్రవారం మండలంలోని హార్సిలీహిల్స్‌పై తనిఖీలు నిర్వహించారు. కొండపై అటవీశాఖ ప్రాంగణంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను పరిశీలించారు. పర్యావరణ సముదాయం నిర్వహణ, ప్ర కృతి అధ్యయన కేంద్రం, అతిథిగృహలను తనిఖీ చేశారు. వీటి నిర్వహణపై సిబ్బందికి సూచనలు చేశారు. కొత్త చేపట్టిన అభివృద్ది పనులు, ఆధునీకరణ, పెయింట్ పనులను పరిశీలించారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి, పండరీపూర్, తిరుపతి మధ్య కొత్తగా వారాంతపు రైలును ఈనెల 16వ తేదీ నుంచి నడపనున్నట్లు రైల్వే ఉన్నతాఽధికారుల నుంచి సమాచారం వచ్చినట్లు కడప రైల్వే కమర్షియర్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి శనివారం తిరుపతిలో (17437) సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల్, వనపర్తిరోడ్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, లాథూర్, బార్సిటౌన్, గురుద్వార్, పండరీపురానికి ఆదివారం చేరుకుంటుందన్నారు. తిరిగి ఇదే రైలు ప్రతి ఆదివారం (17438) రాత్రి 8 గంటలకు బయలు దేరి మరుసటి రోజు సోమవారం రాత్రి 11–30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు.


