అనుగృహమెన్నడో.. | - | Sakshi
Sakshi News home page

అనుగృహమెన్నడో..

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

అనుగృహమెన్నడో..

కడప సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పక్కా ఇళ్ల వ్యవహారం నత్తనడకన నడుస్తోంది. మౌలిక వసతులు కల్పించకుండా గాలికి వదిలేసింది. దీంతో లబ్ధిదారులు ఇళ్లను పూర్తి చేసుకోలేకపోతున్నారు. మౌలిక వసతుల కల్పనకు రూ. 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తేగానీ సమస్య కొలిక్కిరాదు. ప్రధానంగా అర్బన్‌ ప్రాంతాల్లో మౌలిక వసతుల సమస్య వెంటాడుతోంది. దీంతో పట్టణ వాసులు ఇళ్లు మంజూరైనా అందులో చేరలేక, అద్దెలు కట్టుకుంటూనే కాలం వెళ్లదీస్తున్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. పూర్తయ్యేలోగా ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పనులు అటకెక్కాయి. చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు కోర్టు మెట్లెక్కారు.గృహ నిర్మాణశాఖలో మౌలిక వసతుల సమస్య అర్బన్‌ ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో ఉంది. అర్బన్‌ ప్రాంతాలంటే కార్పొరేషన్‌తోపాటు ఆయా మున్సిపాలిటీల్లో ఈ సమస్య ఎదురవుతోంది. ఆ లేవుట్లలో బోర్లు, నీటి తొట్లు, పైపులైన్‌ కనెక్షన్లు పూర్తి కాకపోవడంతో లబ్ధిదారుల ఇళ్లు పూర్తి కాకుండా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.

కోర్టు మెట్లెక్కిన కాంట్రాక్టర్లు

జిల్లా వ్యాప్తంగా అర్బన్‌ లే అవుట్లలో మౌలిక వసతులను పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌కు అప్పగించారు. వారు టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు పనులు చేశారు. చేసిన పనులకు రూ. 7 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. ఎన్ని నివేదికలు అధికారులు పంపినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో చివరికి చేసేదేమి లేక కోర్టు మెట్లెక్కారు. కడప 14, బద్వేలు 7, మైదుకూరు1, ప్రొద్దుటూరు 3, పులివెందుల 1 తదితర ప్రాంతాల్లో మొత్తం 25 అర్బన్‌ లే అవుట్లు ఉన్నాయి. మౌలిక వసతుల కల్పన లేకపోవడం వల్ల లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్‌ సౌకర్యాలు సమకూర్చాలంటే రూ.30 కోట్లు అవసరం అవుతుంది. కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబంధించి రూ. 7 కోట్లు చెల్లించలేని ప్రభుత్వం మొత్తం పనులకు రూ. 30 కోట్లు చెల్లిస్తుందా? అన్న అనుమానం లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది.

కాలనీల్లో మౌలిక వసతులు కరువు

పూర్తి కావాలంటే రూ. 30 కోట్లు అవసరం

ఇళ్లల్లో చేరని లబ్ధిదారులు

గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం

Advertisement
 
Advertisement
Advertisement