కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల్లో ఫలితాల్లో కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ) బాలికలు మెరిశారు. జిల్లావ్యాప్తంగా 17 కేజీబీవీలు ఉండగా వాటిల్లో నుంచి 656 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 596 మంది పాసై 90.85 శాతం ఉత్తీర్ణతను సాధించారు. ఇందులో రెండు కేజీబీవీలు వందశాతం ఉత్తీర్ణత సాధించడం విశేషం.
వైఎస్సార్ కళ... నెరవేరిన వేళ..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయం నెరవేరింది. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన బాలికలు, పేదరికంలో ఉండి చదవాలనే ఆసక్తి ఉన్నా పరిస్థితులు అనుకూలించని నిరుపేద బాలికల కోసం 2005లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాలను (కేజీబీవీలు)ఏర్పాటు చేశారు. నేడు ఎంతో మంది విద్యార్థులు బాగా చదివి విద్యావంతులై తమ ప్రతిభను చాటుతూ భళా అనిపిస్తున్నా రు. ఈ విద్యాలయాలు సాధారణ విద్యతోపాటు ఆంగ్లమాధ్యమం, యోగా, క్రీడలతోపాటు వృత్తి విద్యాకోర్సుల ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తూ బాలికలకు చదువులతోపాటు బతుకుదెరువుకు భరోసానిస్తున్నాయి. దీంతోపాటు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు– నేడు మనబడి కార్యక్రమం ద్వారా కేజీబీవీలకు లక్షలు ఖర్చు చేసి మరిన్ని వసతులు, సౌకర్యాలను కల్పించారు. అలాగే పదవ తరగతి తర్వాత వారు డ్రాపౌట్స్‌గా మారేందుకు వీలులేకుండా అదే కేవీజీబీలలో ఇంటర్ విద్యను కూడా ప్రవేశ పెట్టి వైఎస్ జగన్ మరో అడుగు మందుకు వేశారు.
కేజీబీవీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ టాపర్స్ వీరే...
జిల్లాలోని 17 కేజీబీవీలకు గాను పెండ్లిమర్రి కేజీబీవీకి చెందిన టి. శివజ్యోతి 585 మార్కులు సాధించి కేజీబీవీల ప్రథమస్థానం(టాపర్‌గా)లో నిలిచింది. అలాగే పెద్దముడియం కేజీబీవీకి చెందిన సి. నాగదివ్వశ్రీ 574 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలువగా, మైదుకూరు కేజీబీవీకి చెందిన బి. గురుమానస 571 మార్కులు సాధించి తృతీయస్థానంలో నిలిచింది. అలాగే మరో 22 మంది విద్యార్థులు 550పైగా మార్కులు సాధించి తమ ప్రతిభ చాటారు.
ప్రథమస్థానంలో నిలిచిన శివజ్యోతి
ద్వితీయస్థానంలో నిలిచిన నాగదివ్య
తృతీయస్థానంలో నిలిచిన మానస
పది ఫలితాల్లో 90.85 శాతం ఉత్తీర్ణత సాధించిన కేజీబీవీలు
17 కేజీబీవీల్లో 656 మందికి596 మంది పాస్


