కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ఖరీఫ్–2026 సీజన్ లో అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ఎరువుల సరఫరాలో డైవర్షన్, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్ హాలులో ఖరీఫ్–2026 సీజన్‌కు అవసరమైన ఎరువుల సరఫరా, వినియోగంపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ యూరియా భారీగా పరిశ్రమలకు మళ్లుతున్నట్లు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు సరైన సమయంలో సరిపడా ఎరువులు అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఇన్‌చార్జ్ డీఆర్వో వెంకటపతి, జెడ్పీ సీఈవో సుబ్రమణ్యం,డీఏవో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఎల్‌డీఎం జనార్దనం, నాబార్డు డీడీఎం విజయ విహారి, ఇండస్ట్రీస్ జీఎం చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.
లాభదాయక సాగు కోసం ప్రణాళికలు రూపొందించాలి
‘ఆత్మనిర్భరత మిషన్‘ లక్ష్యం మేరకు.. దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచి, దిగుమతుల అవసరాన్ని తగ్గించడంతో పాటు రైతులకు లాభదాయకమైన వ్యవసాయ మెళుకువలపై అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ‘‘పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత మిషన్’’ అమలుకు సంబంధించి 2026–27 వార్షిక ప్రణాళికపై సంబందిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు సూచనలు చేశారు.


