సర్వేల్లోనే కొత్త రైల్వేలైన్లు | - | Sakshi
Sakshi News home page

సర్వేల్లోనే కొత్త రైల్వేలైన్లు

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

మొన్న ముదిగుబ్బ–ముద్దనూరు

తాజాగా రాయచోటి–కదిరి

కదలికలేని కడప–బెంగళూరు మార్గం

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లాలో కొత్త రైల్వేలైన్లు సర్వేలకే పరిమితమవుతున్నాయనే విమర్శలున్నాయి. దశాబ్దాలుగా కేంద్రంలో యూపీఏ, ఎన్‌డీఏ ప్రభుత్వా ల ఏలుబడిలో కొత్త లైన్లు సర్వేల్లోనే ఆగిపోయాయి.

ముద్దనూరు–ముదిగుబ్బ

ముదిగుబ్బ–ముద్దనూరు రైల్వేలైన్‌ను తీసుకొచ్చారు. 2025–2026 బడ్జెట్‌లో 75 కి.మీ దూరం ఉన్న ఈ లైన్‌కు సర్వే కింద రూ.16 లక్షలు కేటాయించిన సంగతి తెలిసిందే. 110 కి.మీ దూరం ఉన్న ముద్దనూరు–పులివెందుల–శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం లైన్‌కు రూ.2.75కోట్ల ఫైనల్‌ లోకేషన్‌ సర్వేకు కేటాయించారు. అయితే ఈ రెండు లైన్ల పురోగతి లేదు.

కడప–బెంగళూరు ముందుకెళ్లేదెపుడో..

దివగంత సీఎం వైఎస్సార్‌ మానసపుత్రిక కడప – బెంగళూరు రైల్వేలైన్‌ నిర్మాణం కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2010 సెప్టెంబర్‌లో అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప దీనికి శ్రీకారం చుట్టారు. ఈ రైలుమార్గానికి 2008–2009 బడ్జెట్‌లో ఆమోదం లభించింది. రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణపనులు కదిలాయి. 258 కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1, 531 భూసేకరణతో ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ లక్ష్యం ఐదేళ్లు కాదు కదా.. 15ఏళ్లు దాటిపోయేలా కనిపిస్తోంది. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. కడప–బెంగళూరు రైలుమార్గం నాలుగుఫేజ్‌ల్లో నిర్మాణం చేపట్టేలా రైల్వే నిర్ణయించుకుంది. మొదటి దశలో రూ.153 కోట్ల్ల కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20 కోట్లు రైల్వే వ్యయం చేసింది. ఈ దశలో 21.8 కిలోమీటర్ల వరకు చేపట్టారు. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయంచేశారు. పెండ్లిమర్రి లైన్‌ వేశారు. అక్కడితో లైన్‌ ఆగిపోయింది. దీని పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం వాటాను ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇవ్వకపోగా తాజాగా రాయచోటి–హిందుపురం లైన్‌ తీసుకొచ్చారు. దీంతో కడప–బెంగళూరు రైలుమార్గం ఇక అంతేనా.. అన్నమానాలు రాయచోటి వాసుల్లో నెలకొన్నాయి.

ఎంపీ మిథున్‌రెడ్డి కృషి

కడప–బెంగళూరు రైల్వేలైన్‌ నిర్మాణం కోసం ఎంపీ మిథున్‌రెడ్డి పట్టుబట్టారు. లోక్‌సభలో ఈ అంశంపై ప్రశ్నించారు. రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రం అందచేశారు. ఈ క్రమంలో ఈ లైన్‌ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదు. ఈ లైన్‌ నిర్మాణానికి రైల్వేమంత్రి ముందుకువచ్చే అవకాశాలు కనిపించలేదు. పుంగనూరు, మదనపల్లె వంటి ప్రధాన పట్టణాల మీదుగా వెళ్లే ఈ రైలుమార్గం త్వరితగతిన పూర్తికావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

కంభం–ప్రొద్దుటూరు రైల్వేలైన్‌

ప్రకాశం జిల్లా కంభం–జిల్లాలోని ప్రొద్దుటూరు రైల్వేలైన్‌ సర్వేకు పరిమితమైంది. ప్రతిపాదనతో ఊరిస్తోంది. 2023–2024లో కోటిరూపాయిలు కేటాయించారు. కంభం రైల్వేస్టేషన్‌ గుంటూరు–నంద్యాల మార్గంలో ఉంది. ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గంలో ప్రొద్దుటూరు ఉంది. ఈ రైల్వేలైన్‌ పట్టాలు ఎక్కలేదు. 2009–2010లో లైన్‌ సర్వే చేశారు. 142 కి.మీ లైన్‌కు రూ.900 కోట్లు అంచనా వ్యయం చేశారు. 2013–2024లో రైల్వే ఈలైన్‌పై దృష్టి సారించారు. ఎన్‌డీఏ ప్రభుత్వలో దీనిని పక్కనపెట్టేశారు.

కలగానే గిద్దలూరు–భాకరాపేట

యూపీఏ ప్రభుత్వంతోనే భాకరాపేట–గిద్దలూరు(ప్రకాశం) లైన్‌ నిర్మాణం కాలగర్భంలో కలిసిపోయిందనే విమర్శలున్నాయి. ఈలైన్‌ సిద్ధవటం, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు మీదుగా వెళ్లేలా సర్వే రూపొందించారు. 150 కిలోమీటర్‌ మేర లైన్‌ ఉంటుంది. పదేళ్ల క్రితం ప్రాథమికంగా ఇంజినీరింగ్‌ కమ్‌ సర్వే నిర్వహించారు. అప్పట్లో సర్వేకు రూ.కోటి కేటాయించారు. ఈలైన్‌ ఇప్పుడు అతీగతీ లేదని బద్వేలు ప్రాంతవాసులు పెదవివిరిస్తున్నారు.

కడప జిల్లాలో పెండ్లిమర్రి వరకు నిలిచిపోయిన కడప–బెంగళూరు రైలుమార్గం

రైల్వేమంత్రి వైష్ణవ్‌కు వినతి పత్రం ఇస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి(ఫైల్‌)

Advertisement
 
Advertisement
Advertisement