● బాకీ అడిగారని కార్యాలయంలో వీరంగం
● పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్
● ఉపసంహరించుకోవాలని
అధికార పార్టీ నేతల ఒత్తిడి
సాక్షి టాస్క్‌ఫోర్స్ : ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్న వాల్మీకి బోయ కా ర్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజును బాకీ చెల్లించాలనిని అడిగినందుకు.. ఏకంగా ఆ కార్యాలయానికి వెళ్లి మేనేజర్‌పై దాడి చేసిన సంఘటన గురువారం ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నల్లబోతుల నాగరాజు పోట్లదుర్తి గ్రామంలోని తన ఆస్తిని తనఖా పెట్టి రూ.40 లక్షల రుణాన్ని స్థానిక శ్రీరామ్ ఫైనాన్స్‌లో తీసుకున్నారు. ఇందుకుగాను ప్రతి నెల ఆయన రూ.1.31 లక్షలు కంతుగా(ఈఎంఐ) చెల్లించాల్సి ఉంది. గత ఐదు నెలలుగా కంతులు చెల్లించకపోగా నల్లబోతుల నాగరాజు శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయ అధికారులు చేస్తున్న ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు. పలు మార్లు ఇలా జరిగిందని శ్రీరామ్ ఫైనాన్స్ సిబ్బంది తెలిపారు.
ఫర్నీచర్ ధ్వంసం
ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్ ఫైనాన్స్ డివిజనల్ మేనేజర్ బాబాఫకృద్దీన్ నల్లబోతుల నాగరాజుకు ఫోన్ చేశారు. పలు మార్లు చేసినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తమ వద్ద నమోదు చేసుకున్న మరో నంబర్‌కు ఫోన్ చేశారు. ఈ నంబర్‌కు ఫోన్ చేయగా నల్లబోతుల నాగరాజు సతీమణి లిఫ్ట్ చేసింది. తన ఇంటిలోని వారికే ఫోన్ చేస్తావా అని ఆ సెల్ తీసుకున్న నల్లబోతుల నాగరాజు బాబా ఫకృద్దీన్‌ను దూషించాడు. నీవు ఎక్కడ ఉన్నావో చెప్పు అని గదమాయించగా తాను తమ కార్యాలయంలోనే ఉన్నానని, అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నానని బాబాఫకృద్దీన్ తెలిపాడు. వెంటనే తన అనుచరులతో నల్లబోతుల నాగరాజు శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతోపాటు బాబాఫకృద్దీన్‌పై దాడి చేసినట్లు తెలిసింది. తమ బాకీ చెల్లించకపోవడంతో తమ కార్యాలయంపైకి వచ్చి దౌర్జన్యం చేయడంపై శ్రీరామ్ ఫైనాన్స్ డివిజనల్ మేనేజర్ తమ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత స్థానిక త్రీటౌన్ సీఐ రామాంజనేయులును కలిసి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నల్లబోతుల నాగరాజు అధికార పార్టీ ముఖ్య నాయకుడు కావడంతో సీఐ ఉన్నతాధికారులను సంప్రదించి కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కోర్టు ద్వారా కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉండగా అధికార పార్టీ ముఖ్య నాయకుడికి గురువైన న్యాయవాదిని నాగరాజు సంప్రదించగా ఆయన బాబాఫకృద్దీన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించగా జరగని సంఘటనపై కేసు నమోదుకు పోలీసులు అంగీకరించలేదని సమాచారం.
ఎన్నికల ప్రచారంలో..
నియోజకవర్గ ప్రజలతోపాటు వ్యాపార వర్గాలకు రక్షణ గోడగా ఉంటానని ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ముఖ్య అనుచరుడే ఇలాంటి సంఘటనకు పాల్పడటం వ్యాపార వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. చెల్లించాల్సిన డబ్బు చెల్లించకపోగా అడిగినందుకు దాడి చేయడం విచారకరం. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. డివిజనల్ మేనేజర్ నియోజకవర్గ పరిధిలోని కొర్రపాడు గ్రామానికి చెందిన వారు కావడంతో.. కేసు లేకుండా రాజీ చేసేందుకు అధికార పార్టీ నేతలు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు.


