● మరొకరికి తీవ్రంగా గాయాలు
● రోడ్డు పక్కన నిలుచొని ఉండగా
దూసుకెళ్లిన ట్రాక్టర్
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక కొత్తపల్లె బైపాస్ రోడ్డులో ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో పాలిష్ బండల కటింగ్ పని చేసుకునే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా ట్రాక్టర్ వారిపై దూసుకొని వెళ్లింది. ఈ ఘటనలో నంద్యాల జిల్లాలోని చాగలమర్రికి చెందిన ఆకుమల్ల షరీఫ్(22), దువ్వూరు మండలంలోని కృష్ణంపల్లె గ్రామానికి చెందిన అందె నరసింహులు (15) అక్కడిక్కడే మృతి చెందగా చాగలమర్రి మండలంలోని చిన్నవంగలికి చెందిన మేసీ్త్ర ఇమాంఖాసీం తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇమాంఖాసీం పాలిష్ బండల కటింగ్ పని చేస్తుంటాడు. షరీఫ్‌తోపాటు కృష్ణంపల్లెకు చెందిన బాలుడు ఇమాంఖాషీం వద్దకు పనికి వెళ్తుంటారు. వీళ్లు ముగ్గురు కొన్ని రోజుల నుంచి ప్రొద్దుటూరులోని పొట్టిపాడు రోడ్డు, శ్రీనివాసనగర్‌లో పని చేస్తున్నారు. ప్రతి రోజు బైక్‌లో ప్రొద్దుటూరుకు వచ్చి రాత్రికి వారి గ్రామాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో పని ముగించుకొని శుక్రవారం రాత్రి ముగ్గురూ బైక్‌లో బయలుదేరారు. కొత్తపల్లె బైపాస్ గుండా చాగలమర్రికి వెవెళ్తూ శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద బైక్ ఆపారు. ముగ్గురూ రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేస్తుండగా ట్రాక్టర్ వేగంగా వచ్చి వారిపై దూసుకొని వెళ్లింది. ఈ ఘటనలో షరీఫ్, నరసింహులు దుర్మరణం చెందగా, మేసీ్త్ర ఇమాంఖాసీం తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న షరీఫ్, నరసింహులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులు విలపించసాగారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


