● గాలివాన బీభత్సంతో సామగ్రి ధ్వంసం
● ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి
చక్రాయపేట : తమ నాటకాలకు పుట్టనిల్లు అయిన సురభి గ్రామంలో 141వ వార్షికోత్సవ వేడుకలకు వచ్చిన సురభి కళాకారులు(భానోదయ నాట్య కళా మండలి)కు గాలి వాన బీభత్సం సృష్టించి అపార నష్టాన్ని మిగిల్చింది. ఐదు రోజుల పాటు తమ నాటకాల ద్వారా మండల వాసులను అలరింప చేయాలని వచ్చిన వారి గొంతుకలు మూగబోయాయి. గురువారం రాత్రి వారు బాలనాగమ్మ నాటకం వేస్తున్న సమయంలో ఒక్క మారుగా గాలివాన వచ్చింది. దీంతో వారు అన్ని సర్దుకోవాలనే ఆలోచన రాకమునుపే జరగకూడని నష్టం జరిగింది. నాటకానికి సంబంధించిన పరదాలు చినిగి పోయాయి. విద్యుత్ డెకరేషన్‌కు సంబంధించిన లైటింగ్ సిస్టం అంతా పాడై పోయింది. సంగీత వాయిద్యాలు సైతం దెబ్బతిన్నాయి. మేకప్ సామగ్రి మొత్తం గాలివానల పరమైంది. దీంతో దిక్కు తోచక వారు కన్నీటి పర్యంతం అయ్యారు. శుక్రవారం రాత్రి వరకు ప్రశాంత వాతావరణం ఉంటుందని అనుకున్న మేరకు అన్ని నాటకాలు వేద్దామను కుంటే.. ఒక్క రోజు ముందే గాలి వాన ఇబ్బంది పెట్టిందని భానోదయ నాట్య మండలి అధినేత నాగబాబు ఆవేదన వ్యక్తం చేశాడు. నష్టం సుమారు 13 లక్షల వరకు ఉంటుందని కన్నీటి పర్యంతం అయ్యాడు. ప్రాణాలు కాపాడుకుంటామా లేదా అనుకునే లోపే నష్టం జరిగిందని భాను ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశాడు. సురభి(భానోదయ నాట్య కళామండలి)కళాకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆధీనంలో ఉన్న కళాకారుల సంక్షేమ నిధి నుంచి సాయం అందించి, తక్షణం ఆదుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ, బీజీపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో వైద్యం కోసం ఏప్రిల్ 30న గుర్తు తెలియని వ్యక్తి (45)ని తీసుకుని వచ్చారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మరణించారని నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఎవరైనా సరే తగిన ఆధారాలతో సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు తెలియజేశారు.


