కదం తొక్కి.. గళం విప్పి.. | - | Sakshi
Sakshi News home page

కదం తొక్కి.. గళం విప్పి..

May 2 2026 7:50 AM | Updated on May 2 2026 7:50 AM

పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన

సర్కారుపై ధ్వజమెత్తిన సంఘాల నేతలు

ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్‌

కడప ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ ఉద్యోగులు కదం తొక్కారు. సర్కారు వైఖరిపై నిరసన గళం విప్పారు. భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఏపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కడప నగరంలో సీపీఎస్‌ రద్దు మహాసంకల్ప గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వాజ్‌పేయి సర్కిల్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే తక్షణమే సీపీఎస్‌ రద్దుపై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగ సంఘాలు నియోజకవర్గాల వారిగా కృషి చేసి ఓట్లు వేయించారన్నారు. కానీ కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా కాలయాపన చేయడం ఉద్యోగులను వంచించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెండింగ్‌ బకాయిలపై నిర్లక్ష్యం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శ కరిమి రాజేశ్వరావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కమ్మటి మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్‌ బకాయిలు, పీఆర్‌సీ, డీఏలు, సరెండర్‌ లీవ్‌ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ పీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీయపురెడ్డి వెంకట జనార్ధన్‌రెడ్డి, ఎస్‌టీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు మేకల శివార్జున, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పాలేల రామాంజనేయులు, రాష్ట్ర రీ డ్రీసిల్‌ కమిటీ చైర్మన్‌ రామభూపాల్‌రెడ్డి, రామనరసింహా, కడప జిల్లా అధ్యక్షుడు అంకిరెడ్డిపల్లె మదన్‌మోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరేంద్ర, రాష్ట్ర అసోసియేషన్‌ ప్రసిడెంట్‌ చీరల కిరణ్‌తోపాటు గుంటూరు, శ్రీసత్యసాయి, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, అల్లూరు సీతారామరాజు, కర్నూలు, అన్నమయ్య జిల్లాల నాయకులు నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement