దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Apr 30 2026 8:01 AM | Updated on Apr 30 2026 8:01 AM

దరఖాస్తుల ఆహ్వానం ఏపీ కార్ల్‌ సీఈఓగా దామోదర్‌ నాయుడు ఆర్‌ఎంపీ వైద్యశాల సీజ్‌ రౌడీ షీటర్లపై ఉక్కుపాదం ట్రిపుల్‌ఐటీలో విద్యార్థుల ధర్నా

కడప కోటిరెడ్డిసర్కిల్‌: ఏపీఎస్‌ ఆర్టీసీ కడప డిపోలో పనిచేసేందుకు ఆన్‌కాల్‌ డ్రైవర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కడప డిపో మేనేజర్‌ నిరంజన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 30వ తేది డీఎం కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. 21 సంవత్సరాలు దాటి హెవీ లైసెన్స్‌ పొంది 18 నెలలు పూర్తయిన వారు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. ఇతర వివరాలకు తమ కార్యాలయంలోగానీ, 73828 60968 నెంబరులో సంప్రదించాలని వివరించారు.

పులివెందుల రూరల్‌: ఏపీ కార్ల్‌ సీఈఓగా పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దామోదర్‌ నాయుడును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పశుసంవర్థక రంగంలో మరింత పురోగతి సాధించేందుకు కృషి చేస్తానన్నారు.

ప్రొద్దుటూరు రూరల్‌: మండలంలోని దొరసానిపల్లె గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న జింకా అంజనీకుమార్‌ ఆర్‌ఎంపీ క్లినిక్‌ను బుధవారం జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ శ్రీనివాస్‌ సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్‌ఎంపీలు వైద్య ఆరోగ్య శాఖ నిబంధనల మేరకు మాత్రమే సేవలు అందించాలన్నారు. అంతకంటే ఎక్కువ వైద్యం అందించి రిస్క్‌ తీసుకోవద్దని హెచ్చరించారు. హెల్త్‌ సూపర్‌వైజర్‌ బీఏ వరప్రసాద్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ చంద్రశేఖర్‌, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

మదనపల్లె టౌన్‌: జిల్లా వ్యాప్తంగా రౌడీ మూక లను అణచివేయాలని కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మదనపల్లెలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి, అడిషనల్‌ ఎస్పీ వేంకటాద్రి, డీఎస్పీ పావని తో కలిసి జిల్లాలో శాంతి భద్రతల పరిస్థిపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై డేగకన్ను వేయాలని, అలాంటి వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యాభాస్యం పూర్తి చేసి న విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేయాలని బుధవారం రాత్రి ట్రిపుల్‌ఐటీ అకాడమిక్‌ బ్లాక్‌–1 వద్ద ధర్నా చేపట్టారు. ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమకు రావాల్సిన స్కాలర్‌షిప్‌ బకాయిల విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా స్కాలర్‌షిప్‌ నిధులు విడుదల కాకపోవడంతో ఫీజుల చెల్లింపులు ఆగిపోయాయని, దీనివల్ల సర్టిఫికెట్లు పొందే విషయంలో, ఉన్నత చదువుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లోని డెరెక్టర్‌ కార్యాలయం వద్ద వారు బైఠాయించారు. ప్రభుత్వం స్పందించి తమ స్కాలర్‌షిప్‌ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement