కడప అర్బన్: వైఎస్సార్ ఉమ్మడి కడప జిల్లా పరిధిలో ఇద్దరు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ రాష్ట్ర హైకోర్టు విజిలెన్స్ రిజిస్టార్ నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజంపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ప్రస్తుతం ఖాళీ ఉండటంతో అక్కడికి గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి లావణ్య బదిలీ అయ్యారు. బద్వేల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి వై.జె పద్మశ్రీ నెల్లూరు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీగా, సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు.
చెరువులో పడి యువకుడు మృతి
కలికిరి: ప్రమాదవశాత్తు చెరువులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన కలికిరి పట్ట ణ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... కలి కిరి పట్టణం కొత్తపేట వీధికి చెందిన ఎస్.జాకీర్ హుస్సేన్ (33) బుధవారం ఉదయం కలికిరి పెద్దచెరువు వద్దకు బహిర్బూమికి వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడ్డాడు. నీటిలో వ్యక్తి తల కొంతమేర కనిపిస్తుండటం, ఒడ్డున చెప్పులు ఉండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చి, వారి సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుని అక్క మహమ్మద్ జై అప్సానా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృతుని భార్య ఏడాది క్రితం మరణించింది. తల్లిదండ్రులను కోల్పోయిన వీరి ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు.
పిడుగు పడి 16 గొర్రెలు మృతి
– రూ. 2.50 లక్షలు నష్టం
గుర్రంకొండ: పిడుగు పడి 16 గొర్రెలు మృతి చెందిన సంఘటన మండలంలోని శెట్టివారిపల్లె పంచాయతీ ఎస్. కొత్తపల్లె వద్ద జరిగింది. బాధిత గొర్రెల కాపరులకు రూ. 2.50 లక్షలు నష్టం వాటిల్లింది. శె శెట్టివారిపల్లె పంచాయతీ అరిగెలవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు, మంజుల దంపతులు 60గొర్రెలను కాసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం యథావిధిగా గొర్రెల మందను గ్రామానికి సమీపంలో పొలాల్లో నిలిపారు. సాయంత్రం పెద్ద ఎత్తున ఉరుములు మెరుపులు, ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. ఎక్కువ సమయం ఉరుముల శబ్దాలు రావడంతో మందలోని గొర్రెలు భయాందోళన చెందాయి.దీనికి తోడు చిన్న పాటి వర్షం మొదలవడంతో గొర్రెలు నలుదిక్కులకు పారిపోయాయి. 16 గొర్రెలు పొలానికి సమీపంలోని చింత, వేపచెట్టుకింద ఉన్నాయి. ఇంతలోనే పెద్ద ఎత్తున శబ్దం చేస్తూ పిడుగు గొర్రెల మంద ఉన్న చెట్ల పైన పడింది. ఈసంఘటనలో 16 గొర్రెలు ఆక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో గొర్రెల కాపరులు రోదించారు. మృతి చెందిన గొర్రెల విలువ రూ.2.50 లక్షలు వరకు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు.
రిమ్స్‌లో గుర్తు తెలియని
మృతదేహం
కడప అర్బన్: కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో వైద్య సేవల కోసం గుర్తు తెలియని వ్యక్తి (45)ని ఈనెల 28వ తేదీన రాత్రి తీసుకుకొచ్చారు. వైద్యులు అతన్ని పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు తెలియజేశారు.
గొర్రెల మందపై వీధి కుక్కల దాడి
రామాపురం: రామాపురం మండలం సరస్వతీపల్లి దళితవాడలో నివసించే పిల్లిండ్ల ఆంజనేయులు కు చెందిన గొర్రెల మందపై బుధవారం తెల్లవారుజామున వీధి కుక్కల గుంపు దాడి చేశాయి. 40 గొర్రెలను కొరికి చంపాయి. ఉదయం గొర్రెలను బయటకు తీసుకెళ్లేందుకు వెళ్లిన ఆంజనేయులు మృతి చెందిన 40 గొర్రెలను చూసి విలపించాడు.రూ. 5 లక్షల విలువైన గొర్రెలను కోల్పోవడం వల్ల కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నట్లు వాపోయారు.,గ్రామస్తులు విషయాన్ని తహసీల్దార్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వీ ఆర్‌ఓ యామినిని సంఘటన స్థలానికి పంపి నష్టాన్ని అంచనా వేసి,నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.
పసికందు మృతదేహం లభ్యం
రామసముద్రం: అప్పుడే పుట్టిన పసికందును కన్నతల్లి కడతేర్చి పొలాల్లో పారవేసి వెళ్లిన దుర్ఘటన ప్రజలను కలచివేస్తోంది. ఈ సంఘటన రామసముద్రం మండలం చెంబకూరు సమీపంలోని ఎలకపల్లి రోడ్డు మార్గంలో బుధవారం జరిగింది. ఎస్ ఐ హృషీకేశవ్ రెడ్డి తెలిపిన కథనం ఎలకపల్లి సమీపంలోని మామిడి తోపులో గుర్తుతెలియని పసికందును పొలం యజమానురాలు గమనించింది. విషయం తెలియడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ ఐ హృషీకేశవ్ రెడ్డి, తహసీల్దార్ అజారుద్దీన్ తన సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను, చుట్టుపక్కల ప్రజలను ఆరా తీశారు. అనంతరం పసికందు మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పసికందు ఎవరన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


