కడప అర్బన్: కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న నాగరత్నమ్మ కుమార్తె (15) ను పుట్టినరోజు పేరుతో కారులో నలుగురు యువకులు ఈనెల 24వ తేదీన గువ్వలచెరువు ఘాట్ వద్దకు తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాల్లో తిరిగి ఉదయం నాలుగు గంటలకు బాలికను ఇంటి వద్ద వదిలిపెట్టారు. ఈ క్రమంలో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వీరిలో మదరస్ ఆలీ, సయ్యద్ అల్లావుద్దీన్, షేక్ నజీర్ లను అరెస్ట్ చేశారు. మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచినట్లు కడప తాలూకా పోలీసులు తెలియజేశారు.
పాఠశాల మరుగుదొడ్డి తలుపు చోరీ
ప్రొద్దుటూరు కల్చరల్ : మండలంలోనీ డీసీఎస్‌ఆర్ కాలనీలోని ఉర్దూ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పాఠశాల మరుగుదొడ్డి తలుపు మంగళవారం చోరీకి గురైంది. పాఠశాలలో ఎవరు లేని సమయంలో ఆకతాయిలు మద్యం తాగడం, పేకాట ఆడటం వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. మరుగుదొడ్డికి ఉన్న తలుపును దొంగలించడంతోపాటు, స్టోర్ రూం తలుపు, తాళాన్ని ధ్వంసం చేశారు. చోరీ విషయంపై విద్యాశాఖాధికారుల దృష్టి కెళ్లడంతోపాటు పోలీసులకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో
విద్యార్థి మృతి
వల్లూరు: కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై మండల పరిధిలోని తప్పెట్ల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లేబాక విక్రాంత్ రెడ్డి (14) అనే విద్యార్థి దుర్మరణం పాయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు టీ కొత్తపల్లెకు చెందిన లేబాక రామ మనోహర్ రెడ్డి తప్పెట్ల గ్రామానికి, కుమారునిపల్లె క్రాస్‌కు మధ్యలో చిన్నపాటి షాపును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని కుమారుడు విక్రాంత్ రెడ్డి కడపలోని విస్‌డమ్ స్కూల్‌లో 9 వ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవుల నేపథ్యంలో విక్రాంత్ రెడ్డి ఉదయాన్నే ఇంటి నుంచి తమ షాపు వద్దకు నడుచుకుంటూ వెళుతుండగా తప్పెట్ల గ్రామానికి కొద్ది దూరంలో గుర్తు తెలియని వాహనం డీకొట్టి వెళ్లి పోయింది. దీంతో అతని తల నుజ్జునుజ్జుగా మారి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అరటి తోటలో
విద్యుత్ ప్రమాదం
– రూ.10లక్షల పంట నష్టం
లింగాల : లింగాల మండలం చిన్నకుడాల గ్రామంలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అరటి తోటలో విద్యుత్ హెచ్‌టీ వైర్లు తెగిపడి సుమారు 6ఎకరాల తోటలోని అరటి చెట్లు కాలి బూడిదయ్యాయి. గ్రామానికి చెందిన శివనారాయణరెడ్డి అనే రైతుకు చెందిన రెండో పంట అరటి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. విద్యుత్ లైన్ తెగి మంటలు వ్యాపించాయి. ఉదయం 10గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది. గెలలతో ఉన్న అరటి చెట్లు కాలిపోవడంతో సుమారు రూ.10లక్షల దాకా నష్టం వాటిల్లిందని రైతు శివనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. అరటి తోటతోపాటు డ్రిప్ ఇరిగేషన్ పైపులు పోటు కట్టెలు కాలిపోయాయని తెలియజేశారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంవల్లనే ఈ ప్రమాదం సంభవించిందని బాధిత రైతు ఆరోపిస్తున్నాడు. తీవ్రంగా నష్టపోయిన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ రైతులు కోరారు.


