మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం | - | Sakshi
Sakshi News home page

మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

ముగిసిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి

ఆరాధనోత్సవాలు

అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజనం

బ్రహ్మంగారిమఠం : ‘మహాప్రసాదం.. అందిన వారిదే భాగ్యం’ అంటూ భక్తులు పోటీపడ్డారు. స్వామి వారి ప్రసాదం స్వీకరించడం కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బ్రహ్మంగారిమఠంలో ఆరు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన జగద్గురు శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజ మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు మ ధ్యాహ్నం మహాప్రసాద వినియోగం చేపట్టారు. బి య్యం, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, ద్రాక్ష, యాలక్కలు, ఎండుకొబ్బరి, పాలు తదితరాలతో మహాప్రసాదాన్ని తయారు చేశారు. గర్భాలయంలో స్వామి వారి ఎదురుగా.. ఒక రాశిలా పోసి నివేదించారు. అనంతరం మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం ఆయన ధర్మపత్ని ఉమాదేవి ప్రసాదం పంపిణీ చేశారు. భక్తులు స్వీకరించి కళ్లకు అద్దుకుని ఆరగించారు. మరికొందరు ఇంటికి తీసుకెళ్లారు. భక్తులతో క్యూలైన్‌లు కిటకిటలాడాయి. మహాప్రసాదానికి ప్రొద్దుటూరు నియోజకవర్గం సంకటితిమ్మాయపల్లెకు చెందిన పోలు ఎరికలరెడ్డి, సుబ్బారెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. మధ్యాహ్నం మఠాధిపతి మహానివేదన కార్యక్రమం నిర్వహించారు.

ఉత్సాహ భరితంగా ఉత్సవం

ఉదయం ఉత్సవ కార్యక్రమాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు. శ్రీ మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, పీఠంపై అధిష్టింపజేసి, విశేష పూజలు చేశారు. పెద్దమఠం నుంచి చిన్నమఠం వరకు ఊరేగింపు చేపట్టారు. అక్కడ చిన్నమఠం మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి విశేష పూజలు చేశారు. ఊరేగింపు తిరిగి పెద్దమఠం చేరుకుంది. కడప పుట్టా యాడ్స్‌కు చెందిన అమృతమ్మ, వెంకటసుబ్బయ్య శ్రేష్టి, లక్ష్మీదేవి ఉభయదారులుగా వ్యవహరించారు. తెల్లవారుజామున శ్రీవీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని ఆగమ వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భాలయంలోని స్వామి, అమ్మవారి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకంలతో అభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక వస్త్రాలంకరణ చేశారు. స్వామి గుణగణాలను కీర్తిస్తూ, 108 నామాలతో స్తుతిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం మేనేజర్‌ ఈశ్వరయ్య ఆచారి, సిబ్బంది, స్వామి శిష్య బృందం ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుటుంబ సభ్యులు, పీపీఎన్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఎస్‌ఐ శివప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు.

మహానివేదన పూజలు చేస్తున్న మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి

మహాప్రసాదం పంపిణీ చేస్తున్న మఠాధిపతి ధర్మపత్ని ఉమాదేవి

Advertisement
 
Advertisement
Advertisement