దువ్వూరు : మండలంలోని దాసరిపల్లె గ్రామంలో ఈ నెల 21న పొలం గట్టు దగ్గర జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. దువ్వూరు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని దాసరిపల్లె గ్రామంలో ఈనెల 21న పొలం గట్టు దగ్గర జరిగిన ఘర్షణలో మొలకల శ్రీనివాసులు మృతి చెందగా, మొలకల వీరాంజనేయులు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. ఈ హత్య కేసులో ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేయగా, పిక్కిలి వీరన్న, శీలం రామశేషయ్య, శీలం పెద్దయ్య, భోగాది నవీన్‌లను మండలంలో కానగూడూరు వద్ద మంగళవారం అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడైన పిక్కిలి లక్ష్మీనారాయణ, అతని భార్య నరసమ్మ పరారీలో ఉన్నారని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని తెలిపారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో దువ్వూరు ఎస్‌ఐ ధనుంజయుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
భార్య మందలించిందని
భర్త ఆత్మహత్య
కడప అర్బన్ : కడప నగరం యానాది కాలనీకి చెందిన వై.పుల్లయ్య(55) ఈ నెల 27న తన భార్య మందలించిందని విషపుగుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కుటుంబ సభ్యులు రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కడప టూ టౌన్ పోలీసులు తెలిపారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పుల్లయ్య తరచూ మద్యం తాగి రావడంతో భార్య మందలించడంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కడప టూటౌన్ పోలీసులు తెలియజేశారు.
వృద్ధురాలిని బెదిరించి
నగల అపహరణ
కడప అర్బన్ : కడప నగరం రిమ్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామాంజనేయపురంలో సోమవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న లక్ష్మీదేవి అనే వృద్ధురాలిని బెదిరించి ఆమె వద్ద నుంచి 6 తులాల బంగారు నగలు ఓ దొంగ దోచుకుని వెళ్లాడు. ఈ సంఘటన వివరాలను కడప రిమ్స్ ఎస్‌ఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. రామాంజనేయపురంలో లక్ష్మీదేవి, ఆమె భర్త శ్రీనివాసులు ఉంటున్నారు. సాయంత్రం భర్త పని మీద బయటికి వెళ్లడంతో ఒంటరిగా లక్ష్మీదేవి ఇంట్లో ఉంది. గుర్తుతెలియని దుండగుడు వారి ఇంట్లోకి వెళ్లి ఆమెను బెదిరించాడు. ఒక సరుడు, నల్లపూసల దండ మొత్తం 6 తులాల బంగారు నగలు చోరీ చేసి పరారయ్యాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


