ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలో కొత్త కోర్సులు | - | Sakshi
Sakshi News home page

ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీలో కొత్త కోర్సులు

Apr 29 2026 8:00 AM | Updated on Apr 29 2026 8:00 AM

కడప ఎడ్యుకేషన్‌ : కడప నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నుంచి అనుమతి పొందిందని ఉపకులపతి ఆచార్య బి.జయరామిరెడ్డి తెలిపారు. ఆ యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు నూతన అవకాశాలను కల్పించేలా యూనివర్సిటీ కొత్త అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులను ప్రవేశ పెడుతుందని తెలిపారు. సృజనాత్మకత, సాంకేతికత, ఆవిష్కరణలను సమన్వయం చేస్తూ ఈ కోర్సులు విద్యార్థుల భవిష్యత్తును దిశానిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలలో కొత్తగా ‘ఫ్యాషన్‌ అండ్‌ అపారెల్‌ డిజైన్‌’ కోర్సును 60 సీట్లతో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ‘ఫైన్‌ ఆర్ట్స్‌’లో 24 సీట్లతో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సును ప్రవేశ పెట్టనున్నామన్నారు. కళాత్మకతను ఆధునిక సాంకేతికతతో మేళవించే ఈ కోర్సులు విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందిస్తాయని తెలిపారు.

ఈ కోర్సులతో ఉత్తమ కెరీర్‌ అవకాశాలు

‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌’, ‘సివిల్‌ ఇంజినీరింగ్‌’ కోర్సులు ఒక్కొక్కటి 60 సీట్లతో ప్రారంభించనున్నామన్నారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌’ కోర్సును 24 సీట్లతో అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌ చదివిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, డేటా సైంటిస్ట్‌, ఏఐ ఇంజినీర్‌, రోబోటిక్స్‌ నిపుణులు వంటి ఉన్నత స్థాయి టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాలు పొందవచ్చన్నారు. మొత్తంగా ఈ కోర్సులు టెక్నాలజీ, నిర్మాణం, డిజైన్‌ రంగాలను కలిపి విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉత్తమ కెరీర్‌ అవకాశాలు కల్పిస్తాయన్నారు. ఈ కొత్త కోర్సుల ప్రవేశంతో డా. వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ సృజనాత్మకత, సాంకేతికత, డిజైన్‌ రంగాలలో ఒక ప్రముఖ కేంద్రంగా ఎదగనుందన్నారు. భవిష్యత్తుకు అనుగుణమైన విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి సమన్వయకర్త బి.నారాయణ రెడ్డి, ఆర్కిటెక్చర్‌ ప్రిన్సిపాల్‌ మునావర్‌ పాషా, అకాడమిక్‌ నిపుణులు సి.శివయ్య, డాక్టర్‌ ఉషా మాధురి, యూనివర్సిటీ ప్రజా సంబంధాల అధికారి వి.శివకృష్ణారెడ్డి, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement