● కారును ఢీకొన్న టిప్పర్
● డ్రైవర్ దుర్మరణం
● ఇద్దరికి తీవ్ర, ఐదుగురికి స్వల్ప గాయాలు
జమ్మలమడుగు రూరల్ : దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో డ్రైవర్ దుర్మరణం చెందగా, ఇద్దరికి తీవ్ర, ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి. పట్టణ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జయనగర్‌కు చెందిన రంగనాయకులు కుటుంబానికి చెందిన 8 మంది కుటుంబ సభ్యులు పొలతల దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో మంగళవారం జమ్మలమడుగు మండలంలోని పర్యాటక ప్రాంతమైన గండికోటను సందర్శించారు. అనంతరం స్వస్థలం అయిన తాడిపత్రికి రంగనాయకులు, పెద్దక్క, భారతి, వెంకటమ్మ, అనీత, ఆమె భర్త వెంకటరమణ, చిన్నారులైన దీపక్, అమ్ము, ప్రణవ్ కలసి కారులో బయలుదేరారు. మార్గంమధ్యలోని చిటిమిటిచింతల (పాటి) సమీపానికి రాగానే మూద్దనూరు వైపు నుంచి కంకర్ లోడ్‌తో వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ రంగనాయకులు కుమారుడు వెంకటరమణ (24) అక్కడికక్కడే మృతి చెందగా, పెద్దక్క, భారతి, వెంకటమ్మకు తీవ్ర, మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం భారతి, వెంకటమ్మను మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. కుటుంబ యాజమాని రంగనాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


