● ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్
● పోలీస్ సిబ్బందికి
1000 హెల్మెట్లు అందజేత
మాట్లాడుతున్న ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది, వాహనదారులు
కడప అర్బన్ : పోలీసులు బైక్‌పై ప్రయాణించే సమయంలో హెల్మెట్ ధరించి, అందరికీ ఆదర్శంగా ఉండాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. శనివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో దాతల సహకారంతో పోలీస్ సిబ్బందికి 1000 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ వంతు సామజిక బాధ్యతగా పోలీస్ శాఖకు హెల్మెట్లను అందజేసిన దాతలు రెసోనియా ప్రైవేట్ లిమిటెడ్ ట్రాన్స్ మిషన్ కంపెనీ ప్రతినిధులు చీఫ్ మేనేజర్ రాజ్ కుమార్, మేనేజర్ యశ్వంత్, కడప మెడికల్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రతినిధులు నరసింహమూర్తి, ప్రసాద్‌రెడ్డిలకు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి రోజు దైనందిన విధుల్లో భాగంగా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ స్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ద్విచక్ర వాహనంపై విధుల్లో ఉంటారని, ముందుగా వారి సంరక్షణకు హెల్మెట్ ధరించి సాధారణ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని సూచించారు. ముందుగా పోలీస్ శాఖలోని సిబ్బంది నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి చట్ట ప్రకారం కేసులు నమోదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల జరిగిన ప్రమాదాల తీవ్రతను తెలియ చేస్తూ ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను జిల్లా ఎస్పీ ప్రారంభించి తిలకించారు.
భారీ బైక్ ర్యాలీ
పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన హెల్మెట్ అవగాహన ర్యాలీని స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. బైక్ ర్యాలీలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందిలో ఉత్సాహం నింపారు. ర్యాలీ సెవెన్ రోడ్స్ వరకు చేరుకుంది. అనంతరం హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఛాయా చిత్ర ప్రదర్శనను ప్రజలు, వాహనదారులు ఆసక్తిగా తిలకించారు. ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య, ఏఆర్ డి.ఎస్.పి నాగేశ్వర రావు, మైదుకూ రు డి.ఎస్.పి రాజేంద్రప్రసాద్, ఆర్‌ఐలు సోమశేఖర్ నాయక్, శ్రీశైల రెడ్డి, టైటస్, పెద్దయ్య, నగరంలోని సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


