కడప కార్పొరేషన్: కడప నగరం ఆలంఖాన్‌పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి హత్యపై మంత్రి షరీఫ్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి షరీఫ్ టీడీపీ కార్యాలయం నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదివారే తప్పా అందులోని నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదన్నారు. కేసీ కెనాల్ పక్కన ప్రభుత్వ భూమిని పెద్ద దస్తగిరి ఆక్రమించి వెంచర్ వేశారని, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి కట్టడాలు నిర్మించారని చెప్పడం దారుణమన్నారు. రెండేళ్లుగా మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా... నిజంగా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఉంటే ఎందుకు చర్యలు తీసుకోలేదు...గాడిదలు కాస్తున్నారా అని సూటిగా ప్రశ్నించారు. దస్తగిరిని అడ్డం పెట్టుకొని వైఎస్సార్‌సీపీ నాయకులు వందల కోట్లు సంపాదించారని చెప్పడం పచ్చి అబద్ధమన్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించారో వాటిని స్వాధీనం చేసుకోవాలని సవాల్ విసిరారు. హతుడు దస్తగిరి ఒక రవీంద్రనాథ్‌రెడ్డికే కాదు వైఎస్సార్‌సీపీలోని అందరికీ సుపరిచితుడని, తమ పార్టీ సానుభూతి పరుడన్నారు. వ్యాపారరీత్యా అతనికి వైఎస్సార్‌సీపీ నాయకులతోపాటు టీడీపీ నాయకులతోనూ సంబంధాలు ఉన్నాయని, చేనతైనే ఆదిశగా కూడా విచారణ చేయించాలన్నారు. రూ.100 కోట్ల ఆస్తులని ఒకరు, రూ.150 కోట్లని మరొకరు మాట్లాడుతున్నారని, మంత్రి షరీఫ్ ఏకంగా రూ.500 కోట్లని చెప్పడం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా గుడ్డ కాల్చి మొఖాన వేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి వాఖ్యలు చేసి మీపై ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు.
● పెద్ద దస్తగిరి వైఎస్సార్‌సీపీ నాయకులకు బినామీ అని మాట్లాడుతున్నారని, బినామీల దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరైనా ఉంచుతారా అని అంజద్‌బాష ప్రశ్నించారు. సీఎం చంద్రబాబుకు ఎంతమంది బినామీలు ఉన్నారో రాష్ట్ర ప్రజలకు తెలీదా... ఆయన రాజకీయ జీవితంలో ఎంతోమందిని రాజకీయంగా హత్య చేశారని ఆరోపించారు. హత్యలు, దౌర్జన్యాలు, దాడులు చేయడం టీడీపీకి బాగా అలవాటన్నారు. పెద్ద దస్తగిరి 30 ఏళ్లుగా రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, అందుకే అతని వద్ద క్రయ, విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఉండే అవకాశం ఉందన్నారు. అంతమాత్రానే అవన్నీ అతనివి అయిపోతాయా అని ప్రశ్నించారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి, తమకు ఎలాంటి గొడవలు లేవని దస్తగిరి కుటుంబ సభ్యులు చెబుతున్నా దాన్నే పట్టుకొని ఊగులాడుతున్నార న్నారు.
● రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీకి అభ్యర్థులు కరువయ్యారని, అందుకే దస్తగిరి హత్యను రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. కడపలో 50 వార్డుల్లో వారికి ఇన్‌న్‌చార్జులు కూడా లేరని ఎద్దేవా చేశారు. అందుకే వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీలో ఉన్నంత వరకూ భూకబ్జాదారులు, అవినీతి పరులు, అక్రమార్కులుగా ఉన్నవారు టీడీపీలో చేరుతానే పునీతులుగా మారుతారా...అంటూ ప్రశ్నించారు. ప్రతి దాన్ని వైఎస్ జగన్‌కు ముడిపెట్టడం టీడీపీకి అలవాటుగా మారిందని, ఎవరైనా బాత్‌రూములో కాలు జారి పడినా వైఎస్ జగన్ వల్లే అని చెబుతారని ఎద్దేవా చేశారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు నాగయ్య యాదవ్, దాసరి శివప్రసాద్, మైనార్టీ నగర అధ్యక్షుడు ఎస్‌ఎండీ షఫీ, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.
భూములు ఆక్రమిస్తే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది
ప్రభుత్వ వైఫల్యం వల్లే పెద్ద దస్తగిరి హత్య జరిగింది
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ధ్వజం


