కడప కార్పొరేషన్: ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్ డిమాండ్ చేశారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 26వ తేదీ అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ఉదయం 10 గంటలకు ‘వైఎస్సార్‌సీపీ బీసీ గళం’సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్‌లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరాలు మారినా బీసీల తలరాతలు మారలేదన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు, కూటమి నేతలు 139 బీసీ కులాలకు అనేక హామీలు ఇచ్చారన్నారు. 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని, బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పారన్నారు. యాదవులకు రాయితీపై గొర్రెలు, శాలివాహనులకు మట్టికి కావల్సిన భూమి ఇస్తామని, వడ్డెరలకు క్వారీలు, మత్స్యకారులకు బోట్లు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ అఽధికారంలోకి వచ్చాక బీసీల పొట్టకొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మచిలీపట్నం, జువ్వలదిన్నెల్లో ఉన్న ఫిషింగ్ హార్బర్లను పీపీపీ పద్దతిలో ప్రైవేటుకు అప్పగిస్తున్నారన్నారు. బీసీల అభ్యున్నతికి మాజీ ముఖ్యమంత్రి వైఎ్‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారని, కూటమి సర్కార్ వచ్చాక బీసీలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇందులో భాగంగానే రాజకీయంగా దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యాయన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారన్నారు. రాజకీయ కుట్రల్లో బీసీలను పావులుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26న ఛలో అనంతపురం పేరుతో బీసీ గళం సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాల బీసీ విభాగ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, అసెంబ్లీ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి సమ్మెట బసవరాజు, రాష్ట్ర కార్యదర్శి కొప్పుల శివయాదవ్, 21వ డివిజన్ ఇన్‌చార్జి సుబ్బరాయుడు పాల్గొన్నారు.
ఈనెల 26న అనంతపురంలో ‘వైఎస్సార్‌సీపీ బీసీ గళం’
పోస్టర్లు ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి


