నిర్వహణపై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నిర్వహణపై నిర్లక్ష్యం

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

ఎత్తిపోతల పథకాల నిర్వహణపై నిర్లక్ష్యం ● అధికారుల వైఫల్యంతో రైతులకు ఇబ్బందులు

ఎత్తిపోతల పథకాల

పులివెందుల: పులివెందుల నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణలో ఇరిగేషన్‌ శాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణ పరిధి మినీ సెక్రటేరియట్‌లోని ఇరిగేషన్‌ శాఖ కార్యాలయానికి ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డిలు రైతులతో కలిసి వచ్చారు. ఇరిగేషన్‌ శాఖ డీఈలు సారథి, సాయి రంగనాథ్‌, జ్యోతి, జేఈలు చైతన్య, సతీష్‌, అనిల్‌లను కలిశారు. ఈ సందర్భంగా అధికారులతో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాలను సరిగా ఆపరేట్‌ చేయకపోవడంతో సాగునీరు అందక రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. అధికారులు ఒకరోజు ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయిందని, మరొకరోజు మోటార్లు చెడిపోయాయని సాకులు చెబుతున్నారన్నారు. ఎందుకు సకాలంలో మోటార్లను రిపేర్లు చేయించడం లేదని గట్టిగా అధికారులను నిలదీశారు. మోటార్లు సరైన సమయంలో ఆడించకపోవడం వల్ల సాగునీరు అందక లింగాల, వేముల మండలాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. దీనికి అధికారులు వారం రోజుల్లోపు మోటార్లు రిపేర్లు చేయించి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీకి తెలిపారు. వారం రోజుల్లోపు సమస్యను పరిష్కరించకపోతే ఇరిగేషన్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేపడతామని అవినాష్‌రెడ్డి, సతీష్‌రెడ్డిలు అధికారులను హెచ్చరించారు.

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ

ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌కు ఫోన్‌ ద్వారా రైతుల పరిస్థితిని వివరించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను కలెక్టర్‌కు తెలియజేశారు. వెంటనే ఇక్కడి రైతులకు సకాలంలో సాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు.

రాజకీయం తగదు: ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

ఈ సందర్భంగా ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాల నిర్వహణ అధ్వానంగా ఉందన్నారు. లింగాల, వేముల మండలాల్లోని అనేక గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారందరి సమస్యలు విన్నవించడానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి, వేముల, లింగాల మండలాలకు చెందిన రైతులతో కలిసి లింగాల కుడి కాలువ సంబంధించిన ఆఫీస్‌కు వెళ్లామని తెలిపారు. కుడికాలువలో ఎత్తిపోతల పథకాల పనితీరు ఎంత అధ్వానంగా ఉందో, ఎంత నిర్లక్ష్య వైఖరి ఉందో వారి దృష్టికి తీసుకెళ్లామన్నారు. కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, గుణకణపల్లె, తాతిరెడ్డిపల్లె, లోపట్నూతల తదితర గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. సీబీఆర్‌లో 10 టీఎంసీల నీరు ఉండి కూడా ఇంత అథోగతి పట్టడమనేది కేవలం అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి వల్లనే అన్నారు. లింగాల కుడిి కెనాల్‌ వద్ద 5, కుంట వద్ద 5, బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం వద్ద 4 మోటార్లు పని చేస్తే ఈ సమస్య రాదని, అన్ని గ్రామాలకు పుష్కలంగా నీరు ఇవ్వొచ్చన్నారు. మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే రిపేరు చేయించే దిక్కులేదు, పోనీ మేం ముందుకు వచ్చి రిపేరు చేయిస్తామంటే లేదు.. అధికార పార్టీ వాళ్లు పర్మిషన్‌ ఇవ్వాలా, వాళ్లు చెబితేనే ట్రాన్స్‌ఫార్మర్లు బిగిస్తామంటారన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సీబీఆర్‌ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీరు, పైడిపాలెం రిజర్వాయర్‌లో 6 టీఎంసీల నీరు ఉన్నా ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. 200 అడుగులలో ఉన్న నీటి మట్టం, ఈ రోజు అధికారుల వైఫల్యాల వల్ల 1600 అడుగులకు నీటి మట్టం దిగజారిపోయిందని, దీనివల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజకీయ కారణాలతో ఈ ప్రాంత వాసులను ఇబ్బంది పెట్టవద్దని, వెంటనే అధికారులందరూ అప్రమత్తమై జిల్లా కలెక్టర్‌, ఇరిగేషన్‌ సెక్రటరీలు స్పందించి ఈ ప్రాంతానికి నీరు అందే మోటార్లను రిపేరు తయారు చేయించాలని ఎంపీ, అదే విధంగా జగన్‌ కూడా ఆదేశించారన్నారు. అధికారులకు స్పష్టంగా ఒక విషయం చెబుతున్నా మీరు ఏ కారణం చేతయినా పనులు చేయలేకపోతే దయచేసి అవి మాకు అప్పగించండి, ఎంపీ, జగన్‌లు వారి సొంత నిధులతో పూర్తి చేసి రైతులను ఆదుకుంటారన్నారు. జెడ్పీటీసీ బయపురెడ్డి, వేముల, లింగాల మండలాల కన్వీనర్లు సాంబశివారెడ్డి, అంబకపల్లె బాబు, రైతు నాయకుడు చంద్రశేఖరరెడ్డి, మల్లికార్జునరెడ్డి, పెద్దకుడాల శ్రీనివాసులరెడ్డి, విద్యానందరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నాగేంద్ర, మల్లికేశవరెడ్డి, శివరామిరెడ్డి, పుల్లారెడ్డి, హేమాపతిరెడ్డి, నాగచంద్రారెడ్డి, బాబాతోపాటు రైతులు పాల్గొన్నారు.

సాగు నీరందక రైతులకు అష్టకష్టాలు

ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినా కనెక్షన్లు ఇవ్వని వైనం

అధికార పార్టీ నాయకులకు తలొగ్గుతున్న ఇరిగేషన్‌ అధికారులు

వారం రోజుల్లోపు సమస్య పరిష్కరించకపోతే ధర్నా చేస్తాం

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి,వైఎస్సార్‌సీపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి సతీష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement