వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాలు గురువారం త్రిశూల, చక్ర స్నానం, ధ్వజావరోహణం కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. శ్రీ వైద్యనాఽథేశ్వర స్వామి త్రిశూలం, శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి చక్ర తాళ్వార్‌ల చక్రస్నానాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు, శ్రీనివాస మూర్తిల ఆధ్వర్యంలో స్వామి వార్ల త్రిశూలం, సుదర్శన చక్రాలకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పాలు, చందనం, నెయ్యి, పెరుగు, పసు పు, పన్నీరు, కొబ్బరి నీరుతో అభిషేకం నిర్వహించా రు. అనంతరం రెండు ఆలయాల్లో ధ్వజ అవరోహణం చేసి, పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలను ముగించారు.
కనులపండువగా పుష్పయాగం
రాత్రి శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామికి పుష్పయాగాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో, వేద మంత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామికి నిర్వహించిన పుష్పయాగాన్ని చూసిన భక్తులు పులకించారు. అనంతరం తిరుచ్చి వాహన సేవలో భాగంగా గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు


