నమో వీరబ్రహ్మేంద్రస్వామి | - | Sakshi
Sakshi News home page

నమో వీరబ్రహ్మేంద్రస్వామి

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

విద్యుత్‌ దీపాలంకరణలో దేవస్థానం

శేషవాహనంపై ఆశీనులైన వీరబ్రహ్మేంద్రస్వామి

బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో జగద్గురు శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనాన్ని వేద పండితులు ఇడమకంటి జనార్దన శివాచార్య, పోలేపల్లి రామబ్రహ్మం ఆధ్వర్యంలో నిర్వహించారు. గర్భాలయంలోని మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి అర్చనామూర్తులకు గంగ, పంచామృతం, క్షీరం, ఫలోదకంలతో అభిషేకం చేశారు. అర్చనామూర్తులకు ప్రత్యేక వస్త్రాలంకరణ చేశారు. స్వామి గుణగణాలను కీర్తిస్తూ, 108 నామాలతో స్తుతిస్తూ సహస్ర నామార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం వేదపారాయణం చేశారు.

కమనీయంగా శేషవాహనోత్సం

రాత్రి శేషవాహనోత్సవం కమనీయంగా సాగింది. మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి పంచ శిరస్సులు గల శేషవాహనంపై ఆశీనులను చేశారు. స్వామి, అమ్మవారికి మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి విశేష పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తుల ఊరేగింపు పెద్దమఠం నుంచి జగన్మాత శ్రీ ఈశ్వరీదేవి మఠం వరకు సాగింది. అక్కడ చిన్నమఠం మఠాధిపతి శ్రీవీరశివకుమారస్వామి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపు తిరిగి పెద్ద మఠం చేరుకుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం యడవల్లి రమణయ్య భాగవతార్‌ ఆధ్వర్యంలో హరికథను ప్రదర్శించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకుని తరించారు. దాతలు అన్నదానం, మజ్జిగ, వాటర్‌ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలు విరివిగా చేపట్టారు. ప్రొద్దుటూరుకు చెందిన పేర్ల వెంకట బ్రహ్మానందరెడ్డి, గుంటూరుకు చెందిన చేవూరి నరసింహాచారి ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మఠం మేనేజర్‌ ఎన్‌.ఈశ్వరయ్య ఆచారి, సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పీపీఎన్‌ ప్రసాద్‌, దత్తాత్రేయస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఆరాధనోత్సవాలు ప్రారంభం

స్వామి వారికి ప్రత్యేక పూజలు

భారీగా తరలివచ్చిన భక్తులు

Advertisement
 
Advertisement
Advertisement