● భర్తను అంతమొందించేందుకు
భార్య స్కెచ్
● కారుతో గుద్ది చంపేందుకు యత్నం
● తప్పించుకున్న ఈశ్వర్‌రెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : కిరాయి హంతకుతో కలిసి భర్తను అంతం చేసేందుకు భార్య పన్నిన కుట్రను పోలీసులు విచ్ఛిన్నం చేశారు. ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డికి 15 ఏళ్ల క్రితం శిల్పారెడ్డితో వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈశ్వర్‌రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఇటీవల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న
సుధీర్ అనే వ్యక్తి శిల్పారెడ్డికి పరిచయమయ్యాడు. కొద్ది రోజుల తర్వాత వారి పరిచయం వివాహేతర బంధంగా మారింది. ఈ విషయం కొన్ని రోజుల క్రితం శిల్పారెడ్డి భర్త ఈశ్వర్‌రెడ్డికి తెలిసింది. అప్పటి నుంచి వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో శిల్పారెడ్డి ఈ విషయాన్ని ప్రియుడు సుధీర్‌కు తెలిపింది. ‘అలాగైతే నీ భర్తను చంపేద్దాం ఆస్తితోపాటు ఉన్న బంగారు, డబ్బు అంతా మనకే వస్తుందని’ సుధీర్ ఆమెతో అన్నాడు. అందుకు శిల్పారెడ్డి కూడా అంగీకరించింది. ఆమె రాజుపాళెంలోని రౌడీషీటర్ నవీన్ ద్వారా హిందూపురంలో ఉంటున్న లిల్లీ గ్యాంగ్‌ను ఆశ్రయించింది. తన భర్త ఈశ్వర్‌రెడ్డిని చంపేయాలని అందుకు ఎంత ఖర్చు అయినా భరిస్తానని శిల్పారెడ్డి వారితో సుపారి కుదుర్చుకుంది. ఈ క్రమంలో హిందూపురానికి చెందిన కిరాయి గ్యాంగ్ బుధవారం ప్రొద్దుటూరు చేరుకున్నారు. ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్‌రెడ్డిని కారుతో గుద్ది చంపేందుకు ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. వెంటనే వన్‌టౌన్ పోలీసులకు ఈ విషయాన్ని తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నేడో రేపో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
సుధీర్ ఈశ్వరరెడ్డి శిల్పారెడ్డి(ఫైల్)


