పొలం గట్టు తగాదాలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

పొలం గట్టు తగాదాలో ఒకరి మృతి

Apr 24 2026 6:20 AM | Updated on Apr 24 2026 6:20 AM

– మరొకరికి తీవ్ర గాయాలు

దువ్వూరు : మండల పరిధి దాసరిపల్లె గ్రామంలో పొలం గట్టు వివాదంలో ఇరు వర్గాలు ఘర్షణ పడగా ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో పిక్కిలి లక్ష్మీనారాయణ, నరసమ్మ, వీరన్నలకు పొలం ఉంది. వీరి పొలం పక్కనే మేకల శ్రీనివాసులు, ప్రతాప్‌, వీరాంజనేయులుకు పొలం ఉంది. బుధవారం మేకల ప్రతాప్‌ గట్టు మీద ఉండే గడ్డి కోసి గట్టుపైన వేస్తుండగా.. పిక్కిలి నరసమ్మ తమ గట్టుపైన ఎందుకు వేస్తున్నావు అని ప్రశ్నించడంతో.. మొదలైన వివాదం సాయంత్రానికి ఘర్షణకు దారి తీసింది. పిక్కిలి వీరన్న గొడ్డలి తీసుకుని మేకల శ్రీనివాసులు, వీరాంజనేయులుపై దాడి చేశాడు. ఈ దాడిలో మేకల శ్రీనివాసులు, వీరాంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన వారిని 108 అంబులెన్స్‌లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడపలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ శ్రీనివాసులు పరిస్థితి విషమించడంతో బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధనుంజయుడు తెలిపారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల అదుపులో వీరన్న ఉన్నట్లు సమాచారం.

మృతి చెందిన మేకల శ్రీనివాసులు

తీవ్రంగా గాయపడిన వీరాంజనేయులు

Advertisement
 
Advertisement
Advertisement