తొండూరు : తొండూరు బస్టాప్ వద్ద గురువారం ఉదయం లారీ ఢీకొని విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న గురు ప్రణీత్ అనే విద్యార్థి స్థానిక బీసీ హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం నుంచి వేసవి సెలవులు కావడంతో తన స్వగ్రామమైన వేంపల్లెకు వెళ్లేందుకు ఆటోలో తొండూరు బస్టాప్ వద్దకు చేరుకున్నాడు. వాటర్ బాటిల్ కోసమై సమీపంలో ఉన్న కూల్ డ్రింక్స్ షాపు వద్దకు వెళ్లి తీసుకొస్తుండగా రోడ్డుపై ఆర్టీసీ బస్సు ఆగి ఉంది. దీంతో ఆ విద్యార్థి రోడ్డు దాటుతుండగా.. ముద్దనూరు వైపు నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. తొండూరు బీసీ హాస్టల్ వార్డెన్, ఉపాధ్యాయులు, విద్యార్థి తల్లిదండ్రులు 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. కడప రిమ్స్‌లో చూపించిన అనంతరం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళుతుండగా.. రాయచోటి సమీపంలోకి వెళ్లగానే మృతి చెందినట్లు పాఠశాల హెడ్మాస్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో పాఠశాల నుంచి వేసవి సెలవులు పూర్తి చేసుకుని 7వ తరగతిలో జాయిన్ అవుతామని తోటి విద్యార్థులతో చెప్పిన విద్యార్థి.. నిమిషాల వ్యవధిలోని రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు. తొండూరు ఎస్‌ఐ ఘన మద్దిలేటి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సెలవులకు ఇంటికి
వెళ్తుండగా ఘటన


