సాక్షి కడప: ‘కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు భయపడొద్దు... ఎల్లకాలం ఒకటే ప్రభుత్వం ఉండదు.. కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు.. మీకు తోడుగా ఉంటా.. ప్రతి కష్టం వెనుక నేనుంటా..’నని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. ప్రజా దర్బార్‌లో భాగంగా ప్రజలతో, పార్టీ శ్రేణులతో మమేమకయ్యారు. పార్టీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండవ రోజు ఇప్పట్లలో పర్యటించిన వైఎస్ జగన్ అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు.
అడుగడుగునా..
పులివెందుల నుంచి బుధవారం ఉదయం 9గంటలకు ఇప్పట్లకు బయలుదేరిన వైఎస్ జగన్‌కు అడుగడుగునా ‘జన’స్వాగతం లభించింది. అభిమాన నేతతో కరచాలనం చేసేందుకు పార్టీ క్యాడర్ ఎక్కడికక్కడ ఆయన కాన్వాయ్‌ను ఆపారు. పులివెందులలోన్ని అన్ని రింగ్ రోడ్డులతోపాటు లింగాల రోడ్డుకు తిరగగానే కోతి సమాధి ఆంజనేయస్వామి ఆలయం, చిన్న రంగాపురం, గురుకుల పాఠశాల, ఇప్పట్ల క్రాస్... ఇలా ఇప్పట్లకు వెళ్లేలోపు కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్‌ను కలిశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ సైతం కాన్వాయ్‌ని ఆపి ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ముందుకు కదిలారు. యువత సెల్ఫీలు కావాలని కోరగా.. వైఎస్ జగనే సెల్ఫీ ఫొటోతో అవకాశం ఇచ్చారు. పర్యటన ఆద్యంతం అభిమానులు మండుటెండను సైతం లెక్కచేయకుండా రోడ్లపై నిలబడి ఆత్మీయ స్వాగతం పలికారు.
శివాలయంలో ప్రత్యేక పూజలు
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం ఇప్పట్ల గ్రామానికి చేరుకుని గ్రామ శివార్లలో ఉన్న శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయ స్సు కోరడంతోపాటు సంతోషంగా జీవించేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం గ్రామ ప్రజల సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ
ఇప్పట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు కేశంరెడ్డి సుధాకర్‌రెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఇప్పట్ల గ్రామానికి వచ్చారు. ముందుగా దివంగత సుధాకర్‌రెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సుధాకర్‌రెడ్డి భార్య గాయత్రి, ఆయన కుమారుడు ధనుంజయరెడ్డి, కుమార్తె అనూషలతోపాటు కుటుంబీకులను ఓదార్చారు. కుటుంబీకులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
నూతన జంటకు ఆశీర్వాదం
దివంగత మార్తల పుల్లారెడ్డి కుమారుడు విష్ణువర్థన్‌రెడ్డి వివాహం ఇటీవల జరిగిన నేపథ్యంలో బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన జంట విష్ణువర్థన్‌రెడ్డి, అమృతారెడ్డిలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబీకులతో పలు అంశాలపై ముచ్చటించారు. అంతకుముందు గ్రామ మాజీ సర్పంచ్ వెంకట్రామిరెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ కాసేపు గడిపారు.
పులివెందులలోని క్యాంప్ ఆఫీస్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, (ఇన్‌సెట్) అవ్వను పలకరిస్తున్న వైఎస్ జగన్
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు కలిశారు. రాజకీయ అంశాలతోపాటు కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్షపూరిత చర్యలతోపాటు ఇతర అంశాల గురించి చర్చించారు. వైఎస్ జగన్ ను కలిసిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధా, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, విరూపాక్షి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు ఎస్.రఘురామిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, చాంద్ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మాజీ మేయర్లు కొత్తమిద్ది సురేష్‌బాబు, పాకా సురేష్, మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెళ్లి వెంకట్రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన
ఇళ్లు కోల్పోతున్న బాధితులు
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని బుధవారం మధ్యాహ్నం రాజారెడ్డి కాలనీ వాసులు కలిశారు. ప్రధానంగా నేషనల్ హైవే అధికారులు కదిరి – ముద్దనూరు రోడ్డు విస్తరిస్తున్నారని.. తద్వారా తాము ఇళ్లు కోల్పోతున్నట్లు వివరించారు. ప్రభుత్వం అందించే పరిహారం చాలా తక్కువ మొత్తంలో ఉందని, ఈ ప్రాంతంలో భూముల స్థలాల ఎక్కువ రేటు ఉన్న నేపథ్యంలో పరిహారం పెంచి అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ద్వారా అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని వైఎస్ జగన్ భరోసా కల్పించారు.
క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం
మాజీ సీఎం వైఎస్ జగన్ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. జననేత రాకతో క్యాంపు కార్యాలయం వద్ద కోలాహలం కనిపించింది.


