కడప కార్పొరేషన్‌కు కొత్త రూపు | - | Sakshi
Sakshi News home page

కడప కార్పొరేషన్‌కు కొత్త రూపు

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

కడప కార్పొరేషన్‌కు కొత్త రూపు ● పునర్విభజన విధానంపై విమర్శల వెల్లువ

కడప కార్పొరేషన్‌: కడప నగర పాలక సంస్థలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరింది. ప్రస్తుతం 50 డివిజన్లు ఉండగా. వాటిని 66కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కొద్ది రోజులుగా కసరత్తు చేసి. డివిజన్ల ప్రతిపాదన సిద్ధం చేశారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న డివిజన్ల స్వరూపం పూర్తిగా మారిపోనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ డివిజన్ల పునర్విభజన జరగనుండగా, 01.01.2026 నాటికి అప్‌డేట్‌ అయిన ఓటర్ల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఈ లెక్కన ప్రస్తుతం నూతనంగా ఏర్పాటు చేస్తున్న డివిజన్లలో 7వేల నుంచి 8వేల మంది జనాభా వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతి డివిజన్‌లోనూ 4700 నుంచి 5200 ఓటర్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీని ప్రకారం ఒకట్రెండు డివిజన్లు చిన్నవిగాను, రెండు, మూడు డివిజన్లు కొంచెం పెద్దవిగాను ఏర్పడే అవకాశముంది.

ప్రతిపాదనలు ఇలా..

కడప కార్పొరేషన్‌ పరిధిలో 4 జోన్లు ఉన్నాయి. ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్‌, సౌత్‌ జోన్లుగా వాటిని విభజించారు. ప్రతి జోన్‌లోనూ ప్రస్తుతం 12 నుంచి13 డివిజన్లు ఉన్నాయి. ఇకపై ప్రతిజోన్‌లో సుమారుగా 16 నుంచి 17 డివిజన్లు వచ్చే అవకాశముంది. ఈ డివిజన్ల విభజన రోడ్లు, కాలువలు, ల్యాండ్‌ మార్కుల ఆధారంగా విభజించనున్నారు. మొదటి డివిజన్‌ గండివాటర్‌ వర్క్స్‌, మోడమీదపల్లె నుంచి మొదలై చివరి 66వ డివిజన్‌ పాలెంపల్లె, బచ్చుంపల్లె వరకూ ఏర్పాటు కానున్నాయి. 7వేల నుంచి 8వేల జనాభా ఉన్న డివిజన్లు అధికంగా వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఓటర్ల సంఖ్య సరాసరి 5000గా ఉండనుంది.

ప్రజాభిప్రాయ సేకరణ..

ముసాయిదా జాబితాల ప్రతిపాదనలు ఈ నెల 27 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కమిషనర్‌ రాకేష్‌ చంద్ర ఆదేశాల మేరకు సిటీ ప్లానర్‌, ఏసీపీల ఆధ్వర్యంలో డివిజన్ల ఏర్పాటుపై కసరత్తు చేసి ప్రాథమికంగా ముసాయిదా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ రూపాందించిన మూసాయిదాపై కడప ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. అనంతరం ముసాయిదాలో. చేయాల్సిన మార్పులు, చేర్పులను చేస్తారు. ఖరారైన ముసాయిదాను ఈ నెల 27 నుంచి ప్రజాభిప్రాయ సేకరణకు బహిరంగ ప్రదేశాల్లో ఉంచుతారు. ఆ తర్వాత డ్రాఫ్టు నోటిఫికేషన్‌ను ప్రభుత్వానికి పంపిస్తారు.

కమలాపురానికి ప్రాతినిధ్యం లేనట్లేనా....

కడప నగరపాలక సంస్థలో విలీనం అయిన గ్రామ పంచాయతీల్లోని కొన్ని డివిజన్లు అటు కడప, కమలాపురం నియోజకవర్గాలకు వర్తించే విధంగా ఉండేవి. అంటే భౌగోళికంగా కడప నగరపాలక సంస్థలో ఉన్నప్పటికీ ఆ డివిజన్ల ప్రజలు మాత్రం కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు వేసేవారు. ఇప్పుడు అలా కాకుండా కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఓటర్లతోనే వార్డుల పునర్విభజన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అటు జనాభా, ఓటర్ల సంఖ్యలో తేడాలు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

డివిజన్ల ఏర్పాటు ఇలా..

(ఓటర్ల సంఖ్య ఆధారంగా అంచనా)

ఓటర్ల సంఖ్య ఏర్పాటయ్యే డివిజన్లు

4700–5000 మధ్య 30

5000–5200 మధ్య 36

కొలిక్కివచ్చిన డివిజన్ల పునర్విభజన కసరత్తు

50 నుంచి 66కు పెంచుతూముసాయిదా ప్రతిపాదన

ప్రతి డివిజన్‌లో 4700 నుంచి5200 ఓట్లు ఉండేలా విభజన

ఈ నెల 27 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

కడప నగరపాలక సంస్థలో డివిజన్ల పునర్విభజనపై విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు కాకుండా కడప ఎమ్మెల్యే ఆర్‌. మాధవి, టీడీపీ జోనల్‌ కో ఆర్డినేటర్‌ ఆర్‌. శ్రీనివాసులరెడ్డి ఒత్తిడి మేరకు వారు చెప్పినట్లే చేస్తున్నారని, డివిజన్లను వారికి అనుకూలంగా ఇష్టం వచ్చినట్లు కోసేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్‌ అధికారులు సాయంత్రం వేళల్లో గంటలు గంటలు వారితో భేటీ కావడం విమర్శలకు బలం చేకూరుతోంది. అలాగే కొందరు టీడీపీ డివిజన్‌ ఇన్‌చార్జులు చెప్పిట్లుగానే వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను డివిజన్‌గా రూపొందించినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement