వల్లూరు: పుష్పగిరిలోని శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం హరిహరుల రథోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం శ్రీ వైద్యనాథేశ్వర స్వామి రథోత్సవం జరిగింది. శ్రీ కామాక్షీ సమేతుడైన వైద్యనాథ స్వామి రథంలో ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. పూజల అనంతరం శివ నామాన్ని స్మరిస్తూ భక్తులు పోటీలు పడి రథాన్ని లాగారు. కాయ కర్పూరాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
● సాయంత్రం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి రథోత్సవం కనులపండువగా సాగింది. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి గ్రామోత్సవాలలో వివిధ వాహనాలపై ఒంటరిగా దర్శనమిచ్చిన చెన్నకేశవ స్వామి కల్యాణ మహోత్సవంతో పరిపూర్ణుడై శ్రీదేవి, భూదేవిలతో కలిసి రథంపై ఆశీనులయ్యారు. బంగారు ఆభరణాలతో అలంకార భూషితులైన స్వామివారు ఇరువురు దేవేరులతో కలిసి దర్శనమివ్వడంతో సాక్షాత్తు వైకుంఠంలోని శ్రీహరి అంశకు చెందిన శ్రీ వెంకటేశ్వరున్ని దర్శించుకున్నట్లుగా భక్తులు పులకించి పోయారు. ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో రథం వద్ద పూజలు చేశారు.
● రధాల వద్ద జరిగిన పూజల్లో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా శంకర భారతి పాల్గొన్నారు.
● రాత్రి మొదట శ్రీ కామాక్షీ వైద్యనాథస్వామికి, అనంతరం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామికి అశ్వ వాహనంపై గ్రామోత్సవం జరిగింది.
పుష్పగిరిలో నేడు: బహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం త్రిశూల, చక్రస్నానం జరుగుతుంది. అనంతరం ధ్వజ అవరోహణం జరుగుతుంది.


