కడప కోటిరెడ్డిసర్కిల్: రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై ఈనెల 24వ తేదీన కడప, మదనపల్లెల్లోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ పీవీఎన్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి నిర్వహించే ఈ సదస్సుల్లో రియల్టర్లు, డెవలపర్లు, డాక్యుమెంట్ రైటర్లు, స్టేక్ హోల్డర్లు పాల్గొనాలన్నారు. సదస్సులో గ్రౌండ్ లెవల్ సమస్యల పరిష్కారం, వాల్యుకేషన్, రిజిస్ట్రేషన్‌పై అవగాహన కల్పిస్తారన్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఆంగన్‌వాడీ వర్కర్లు, ఆంగన్‌వాడీ హెల్పర్లు పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 23వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఆయా పరిధిలోని మండలాలకు అభ్యర్థులు గురువారం ఉదయం 10:30 గంటలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు.
వేంపల్లె: ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ (ఆర్కే వ్యాలీ) నూతన డైరెక్టర్‌గా ప్రొఫెసర్ డాక్టర్ గడ్డం విజయ్ ప్రకాష్‌ను నియమిస్తూ బుధవారం ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆర్జీయూకేటీ ఉప కులపతి, ఆర్కేవ్యాలీ, శ్రీకాకుళం డైరెక్టర్లను నూతనంగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఐఐటీ కాన్పూర్‌లో కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన రసాయన విభాగంలో హెచ్‌ఏజీగా పనిచేస్తున్న ప్రొఫెసర్ మద్దాలి లక్ష్మీనారాయణరావును ఆర్జీయూకేటీ ఉప కులపతిగా నియమించారు.


