ఎన్నికల్లో లబ్ధికే అక్రమ కేసులు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో లబ్ధికే అక్రమ కేసులు

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు కె.సురేష్‌బాబు

కడప కార్పొరేషన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతోందని పార్టీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌(సీఈసీ) సభ్యులు కె. సురేష్‌ బాబు, పార్టీ నాయకులు మండిపడ్డారు. పెద్దదస్తగిరి హత్యకేసును వైఎస్సార్‌సీపీకి అంటగడ్డటంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌లతో కలిసి కె. సురేష్‌ బాబు, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆలాంఖన్‌పల్లెలో గంగమ్మ జాతర సందర్భంగా జరిగిన చిన్న గొడవ హత్యకు దారి తీసిందన్నారు. రాజా, రవి అనే వారిని అప్పటి సీఐ పురుషోత్తం రెడ్డి మండలం నుంచి బహిష్కరిస్తే, వారు ఆలాంఖన్‌పల్లెలో వచ్చి చేరారు. గంజాయి, డ్రగ్స్‌ సేవిస్తూ సాయంత్రమైతే పానీపూరీ బండ్లు మొదలుకొని ప్రతి షాపు నుంచి మామూళ్లు వసూలు చేసేవారు. ఇవన్నీ పోలీసులకు తెలియవా...రౌడీ మూకలు చేసిన దాన్ని వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడం దారుణమని అన్నారు. . ఇందులో భాగంగా రోజుకొక పేరు తెరపైకి తెస్తూ పక్కదారి పట్టిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిప్పటి నుంచి జోగిరమేష్‌, పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, అంబటి రాంబాబు, చెవిరెడ్డి, మిథున్‌రెడ్డి, నందిగం సురేష్‌ ఇలా ఎవర్నీ వదలకుండా కేసులు పెట్టి జైలుకు పంపారు. తమ కార్యకర్త చనిపోయి తామంతా బాధలో ఉంటే తమపైనే నిందలు వేయడం దుర్మార్గం. ఫోటోలు దిగినందుకే హత్య కేసు అంటగడతారా...చంద్రబాబు 420 కాబట్టే ఇలాంటివి చేస్తున్నారు. ఇంతటి నీచ సంస్కృతి దేశంలో ఎక్కడా లేదని ఆయన అన్నారు.

ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే...

ప్రభుత్వ వైఫల్యాన్ని, పోలీసుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే వైఎస్సార్‌సీపీపై నిందలు వేస్తున్నారు. గంజాయి మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోకుండా...ప్రతి చిన్న సంఘటనను వైఎస్‌ జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడం దారుణం. గంజాయి, డ్రగ్స్‌ సేవించే వారు డబ్బు కోసం దోపీడీలు చేస్తూ రౌడీయిజం చెలాయిస్తున్నారు. నిందితులతో ఫోటోలు దిగినంత మాత్రానా సంబంధం ఉన్నట్లేనా... – ఎంవీ రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ.

గంజాయి, డ్రగ్స్‌ మూలాలను వెలికి తీయాలి

మద్యం, గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకుతుండం వల్లే శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. వాటి మూలాలు ఎక్కడ ఉన్నాయో పోలీసులు వెలికి తీయాలి. పెద్ద దస్తగిరి ఇంటిపై సుమారు 40 దాడి చేసినప్పుడే అతను పోలీసుల రక్షణ కోరాడు. అప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఇప్పుడు పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్సార్‌సీపీ నాయకులపై రుద్దుతున్నారు. నిత్యానందరెడ్డికి, దస్తగిరికి మధ్య ఎలాంటి గొడవలు, విభేధాలు లేవు. నిత్యానందరెడ్డిపై జరిగిన ఒక్క లావాదేవీ కూడా పోలీసులు చూపలేదు. రాజకీయంగా ఎదుగుతున్న వ్యక్తిని వేధించడం సరికాదు.

– పాకా సురేష్‌ కుమార్‌, మాజీ మేయర్‌.

స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇదంతా...

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొ ని కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. స్థానిక ఎన్నికలపై వారు నిర్వహించిన సర్వేలో కడపలో ఆరు సీట్లు కూడా రావని తెలుసుకొని, వైఎస్సార్‌సీపీని ఎలాగైనా దెబ్బతీయాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారు. తాడేపల్లి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం హత్య జరిగిందని మంత్రులు ఆరోపించడం సిగ్గుచేటు. ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి.

– ఎస్‌. యానాదయ్య, ఎస్‌ఈసీ సభ్యులు. వైఎస్సార్‌సీపీ

Advertisement
 
Advertisement
Advertisement