బద్వేలు టీడీపీలో ముదిరిన విభేదాలు | - | Sakshi
Sakshi News home page

బద్వేలు టీడీపీలో ముదిరిన విభేదాలు

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

అభివృద్ధి పనుల శంకుస్థాపన

విషయంలో ఇరువర్గాల మధ్య రచ్చ

పలుచోట్ల శంకుస్థాపనలు చేసిన

సూర్యనారాయణరెడ్డి

తాజాగా తెలుగుగంగ రోడ్డు

శంకుస్థాపన పనులను అడ్డుకున్న

రితీష్‌ వర్గీయులు

పోలీసుల జోక్యంతో

ప్రస్తుతానికి సద్దుమణిగిన వివాదం

శంకుస్థాపన పనులు అడ్డుకునేందుకు వచ్చిన రితీష్‌రెడ్డి వర్గీయులు

విద్యానగర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సూర్యనారాయణరెడ్డి (ఫైల్‌)

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదిరాయి. మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ క్రమంలో బుధవారం స్థానిక తెలుగుగంగ కాలనీ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేయనున్న సీసీ రోడ్డు పనులకు డీసీసీ బ్యాంకు చైర్మన్‌ సూర్యనారాయణరెడ్డి శంకుస్థాపన చేయాల్సి ఉండగా రితీష్‌రెడ్డి వర్గీయులు అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్‌ పోలీసులు రితీష్‌ వర్గీయులకు సర్దిచెప్పడంతో ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగింది.

శంకస్థాపన విషయంలో ముదిరిన విభేదాలు ..

బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొంత కాలంగా రితీష్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డిల నడుమ ఆధిపత్యపోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి కొందరు రితీష్‌రెడ్డి చెంత, మరికొందరు సూర్యనారాయణరెడ్డి చెంత చేరారు. పార్టీ కార్యక్రమాలు ఇరువురు నాయకులు వేరువేరుగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బద్వేలు మున్సిపాలిటీకి ఎల్‌ఆర్‌ఎస్‌బీపీఎస్‌ స్కీం కింద సుమారు రూ.3 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వీటితో పట్టణంలోని 35 వార్డుల్లో రూ.1.40 కోట్లతో ఒక ప్యాకేజీ, రూ.1.45 కోట్లతో మరో ప్యాకేజీ చొప్పున రెండు ప్యాకేజీలుగా అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు. 6 శాతం లెస్‌తో టెండర్లు దక్కించుకున్న పుల్లంపేటకు చెందిన సుబ్బారెడ్డి అనే కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం స్థానిక విద్యానగర్‌లో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు డీసీసీ బ్యాంకు చైర్మన్‌ సూర్యనారాయణరెడ్డితో శంకుస్థాపన చేయించారు. తిరిగి బుధవారం నాడు తెలుగుగంగకాలనీ రోడ్డులో రూ.10 లక్షల వ్యయంతో చేపట్టాల్సిన సీసీ రోడ్డు పనులకు సూర్యనారాయణరెడ్డి శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇంతలో విషయం తెలుసుకున్న రితీష్‌రెడ్డి వర్గీయులు టీడీపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన పనులను అడ్డుకునేందుకు బయలుదేరారు. అయితే ముందస్తుగానే విషయం తెలుసుకున్న సూర్యనారాయణరెడ్డి ఉన్నతాధికారుల సూచనల మేరకు శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అప్పటికే తెలుగుగంగకాలనీ రోడ్డుకు చేరుకున్న రితీష్‌రెడ్డి వర్గీయులు స్థానిక ఎన్‌జీవో కాలనీలోని సూర్యనారాయణరెడ్డి ఇంటి సమీపంలోకి వచ్చి గుమికూడారు. ఇంతలో విషయం తెలుసుకున్న అర్బన్‌ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ కొండారెడ్డిలు సిబ్బందితో వెళ్ళి పరిస్థితిని పర్యవేక్షించారు. కొద్దిసేపు సూర్యనారాయణరెడ్డి ఇంటి సమీపంలోనే ఉన్న రితీష్‌రెడ్డి వర్గీయులు దగ్గరలోనే ఉన్న మున్సిపల్‌ కార్యాలయం వద్దకు వచ్చి ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. గతంలో మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రితీష్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ వద్దకు వెళ్ళి పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయించామని, కాంట్రాక్టు దక్కించుకున్న వ్యక్తి తమ ప్రమేయం లేకుండా ఇతరులతో శంకుస్థాపన ఎలా చేయిస్తారని, ఈ విషయంపై మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చామని తెలిపారు. ఇదే సమయంలో సూర్యనారాయణరెడ్డి ఇంటి వద్ద సైతం ఆయన అనుచరులు గుమికూడారు. పోలీసుల జోక్యంతో ప్రస్తుతానికి ఈ సమస్య సద్దుమణిగింది.

Advertisement
 
Advertisement
Advertisement