బ్రహ్మంగారిమఠం.. ఉత్సవ శోభితం | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మంగారిమఠం.. ఉత్సవ శోభితం

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

నేటి నుంచి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

ఏర్పాట్లు పూర్తి

బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. శ్రీ మద్విరాట్‌ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతులతో ధగధగలాడుతోంది. ఆలయానికి రంగులతో మెరుగులద్దారు. దేవాలయంతోపాటు పరిసరాలను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ప్రాంగణంలో శోభాయమానంగా రంగవళ్లులు వేశారు. ఆకట్టుకునేలా ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. వెరసి ఉత్సవాలను పురస్కరించుకుని క్షేత్రం నూతన శోభ సంతరించుకుంది.

ఉత్సవాలు ఇలా..

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు కావున.. ఏటా ఆయన శిష్యబృందం, భక్తులు.. ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఈ నెల 23 నుంచి ఉత్సవాలు 28 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా రోజూ ఉదయం శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, నామ సంకీర్తనం, అభిషేకం, సహస్ర నామార్చన కార్య్రకమాలు నిర్వహిస్తారు. తర్వాత గుడి ఉత్సవం ఉంటుంది. రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటాయి. అలాగే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి రోజూ ఒక్కో వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. 23న శేషవాహనోత్సవం, 24న గజవాహనోత్సవం, 25న నరనంది ఉత్సవం, 26న నంది ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. 26న సజీవ సమాధి నిష్ట వహించిన పవిత్ర దినం కావడంతో.. స్వామి వారు దీక్షాబంధన అలంకారోత్సవంలో దర్శనమిస్తారు. బ్రహ్మంగారి మాలధారణ చేసిన భక్తులు ఇరుముడి సమర్పిస్తారు. 28న మహాప్రసాద వినియోగంతో ఉత్సవాలు ముగుస్తాయి.

భారీగా భక్తుల రాక

వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. స్వామి మాల ధరించిన భక్తులు ఇప్పటికే చేరుకుంటున్నారు. వారితో కందిమల్లాయపల్లె కళకళలాడుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు చలువ పందిళ్లు వేశారు. వసతి, మంచినీరు, మజ్జిగ, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఏర్పాట్లు చేయడంలో మఠం నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, స్వామి శిష్యబృందం పాలుపంచుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement