ప్రశ్నించే ఉద్యోగులపై చర్యలు దారుణం | - | Sakshi
Sakshi News home page

ప్రశ్నించే ఉద్యోగులపై చర్యలు దారుణం

Apr 23 2026 8:06 AM | Updated on Apr 23 2026 8:06 AM

ఉద్యోగ సంఘ నేత కె. వెంకట్రామిరెడ్డిని డిస్మిస్‌ చేయడం అన్యాయం

ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి

కడప కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి సర్కార్‌ ఏర్పడి దాదాపు రెండు సంవత్సరాలవుతున్నా, ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా, పైపెచ్చు వారి మీద చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పీఆర్‌సీ వేస్తామని, పెండింగ్‌లో ఉన్న డీఏ, ఐఆర్‌ బకాయిలు, ఉద్యోగస్తులందరికీ రావాల్సిన అన్ని రకాల బకాయిలు కూడా వెంటనే ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన ఉద్యోగుల సంఘం నాయకుడు కాకర్ల వెంకట్రామి రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆయన్ను సర్వీసు నుంచి డిస్మిస్‌ చేయడం అన్యాయమన్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులపై కక్షసాధింపేనని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వారి సమస్యల మీద విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద నిరసన దీక్షలు చేయడం జరిగింది. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే కక్ష సాధింపు చర్యలు మానుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. నిరుద్యోగ యువకులకు కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచార సమయంలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని,అవి ఇచ్చేవరకు ప్రతి నిరుద్యోగికి, ప్రతినెల 3 వేల రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులందరికీ ఇవ్వవలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తక్షణమే విడుదల చేసి కాలేజీలు సజావుగా జరిగేటట్లు చూడాలన్నారు. పాఠశాలలు తెరిచేనాటికి నాడు–నేడు ద్వారా చేపట్టి పెండింగ్‌ లో ఉన్న పనులన్నీ పూర్తి చేసి విద్యార్థులందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement