నీరుపయోగం | - | Sakshi
Sakshi News home page

నీరుపయోగం

Apr 5 2026 7:54 AM | Updated on Apr 5 2026 7:54 AM

లింగాల : లింగాల మండలం రామన్నూతనపల్లె, మురారిచింతల గ్రామ సమీపంలో ఉన్న చెరువులు నీరులేక వెలవెలబోతున్నాయి. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చొరవతో మండలంలోని అన్ని గ్రామాలకు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వీటికి పాడా నిధులను వినియోగించారు. అందులో భాగంగా సుమారు రూ.5కోట్ల పాడా నిధులతో రామన్నూతనపల్లె, గుణకణపల్లె చెరువులకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు అందించేందుకు పంప్‌ హౌస్‌లు ఏర్పాటు చేశారు. పంప్‌ హౌస్‌లకు మోటార్లు, పైపులైన్లు పూర్తయ్యాయి. అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆయా చెరువులకు చుక్క నీరు అందడంలేదు. గత ఏడాది అనావృష్టి, ప్రస్తుతం మండుతున్న ఎండలతో బోరు బావుల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రామన్నూతనపల్లె చెరువు నీరు నింపితే రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల, పెద్దకుడాల, చిన్నకుడాల తదితర గ్రామాల్లోని బోరుబావుల్లో భూగర్భజలాలు పెంపొందుతాయని అక్కడి రైతులు తెలిపారు. గుణకణపల్లెకు సంబంధించి ఎత్తిపోతల పథకం, పైపులైన్‌ కూడా పూర్తి చేశారు. అయితే చెరువుకు సంబంధించి భూసేకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రామన్నూతనపల్లె ఎత్తిపోతల పథకానికి సంబంధించి మోటార్లు ఉన్నప్పటికీ విద్యుత్‌ నియంత్రికలు లేకపోవడంవల్ల నీటిని విడుదల చేయలేదు. మరోవైపు దీని పనులు నిర్వహించిన కాంట్రాక్టర్‌ శివప్రకాష్‌రెడ్డి తనకు బిల్లులు అందలేదని, వాటిని అధికారులకు అధికారికంగా అప్పగించలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా గ్రామాల్లో విస్తారంగా అరటి, చీనీ, టమోట, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటితే పంటలు చేతికి అందడం కష్టంగా మారుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా నీటి పారుదల శాఖ అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రామన్నూతనపల్లె చెరువుకు నీటిని అందించాలని కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈ చైతన్యారెడ్డిని వివరణ కోరగా ఆయా ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పనులు పెండింగ్‌లో ఉన్నాయని, కొన్ని మోటార్లు, స్టాటర్లు పనిచేయడంలేదన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు. పరికరాలు వచ్చిన వెంటనే ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి రామన్నూతనపల్లె చెరువుకు నీరు అందిస్తామని తెలిపారు.

బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి అందని నీరు

బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి నీరు అందక లోపట్నూతల, కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నెల రోజుల క్రితం బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి కర్ణాటక ప్రాంతం నుంచి ట్రాన్స్‌ఫార్మర్‌ను తీసుకొచ్చి అందించారు. దీంతో కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, లోపట్నూతల గ్రామాలకు కొద్దిపాటి నీరు చేరడంతో రైతుల బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగి పంటలకు కొంత ఊరట లభించింది. అదేవిధంగా బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్‌పార్మర్‌ కాలిపోయినా అధికార పార్టీ నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకున్నా పాపానపోలేదు. ప్రస్తుతం వెలిదండ్ల సమీపంలోని లింగాల కుడికాలువ నుంచి భారీ మోటార్ల ద్వారా వరదరాజులస్వామి కోన సమీపంలో ఉన్న చెరువుకు నీరు అందించాల్సి ఉంది. అయితే వెలిదండ్ల సమీపంలోని కుడికాలువ వద్ద ఉన్న పంప్‌ హౌస్‌లో మోటార్లు పనిచేయకపోవడంతో వరదరాజులస్వామి కోన సమీపంలోని చెరువుకు నీరు అందడంలేదు. వరదరాజులస్వామి కోన నుంచి బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి నీరు తరలించాలి. వరదరాజులస్వామి కోన సమీపంలోని చెరువులో నీరు లేకపోవడంతో అక్కడ ఉన్న ఒక్క మోటారుకు సరిపడా నీరు ఉన్నాయని, మూడు మోటార్లు ఆడించే అవకాశం లేకుండాపోయింది. దీంతో బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి నీరు చేరడంలేదు. అరకొరగా చేరుతున్న నీటిని ఒక్క మోటారు ద్వారా బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం కింద కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, లోపట్నూతల గ్రామాలకు సక్రమంగా నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు కానీ, కూటమి నాయకులు కానీ పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తామే రైతులను ఆదుకుంటామని, సాగు, తాగునీరు అందిస్తున్నామ ని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకులు ఎత్తిపోతల పథకాల వ్యవస్థు ఎలా పనిచేస్తున్నాయో కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఈఈకి ఫోన్‌ చేయగా.. ఆయన స్పందించడంలేదు.

ఉన్నతాధికారులు స్పందించాలి

సాగునీరు లేక తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ, జిల్లా కలెక్టర్‌లు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అధికార పార్టీ నాయకులు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని, రైతుల అవస్థలను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు.

నీరులేక వెలవెలబోతున్న రామన్నూతనపల్లె, మురారిచింతల చెరువులు

ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ట్రాన్స్‌ఫార్మర్‌ అందించినా సద్వినియోగం చేసుకోని అధికారులు

భూగర్బజలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆవేదన

పేరుకే రైతు ప్రభుత్వం

కూటమి సర్కార్‌ పేరుకే రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటోంది. పంటలకు గిట్టుబాటు ధరలు అందించడంలో విఫలమైంది. సీబీఆర్‌లో నీరు ఉన్నా, లింగాల కుడికాలువకు నీరు ప్రవహిస్తున్నా ఎత్తిపోతల పథకాలను ప్రారంభించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి వాటిని పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి రైతులకు సాగు, తాగునీరు అందించాలి. – ఇరికిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డి, రైతు, రామన్నూతనపల్లె

చెరువుకు నీరు నింపాలి

రామన్నూతనపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు నింపితే మండలంలోని రామన్నూతనపల్లె, లింగాల, గుణకణపల్లె, చిన్నకుడాల గ్రామాల్లోని బోరుబావుల్లో భూగర్భజలాలు పెంపొందుతాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు ధైర్యంగా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకుని రామన్నూతనపల్లె చెరువుకు నీరు అందించాలి. – ఈశ్వరరెడ్డి, రైతు, రామన్నూతనపల్లె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement