క్రేట్లలో గోల్‌‘మాల్‌’.. వ్యాపారుల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

క్రేట్లలో గోల్‌‘మాల్‌’.. వ్యాపారుల హల్‌చల్‌

Mar 20 2026 8:10 AM | Updated on Mar 20 2026 8:10 AM

క్రేట్లలో గోల్‌‘మాల్‌’.. వ్యాపారుల హల్‌చల్‌

మదనపల్లె: అన్నమయ్య జిల్లాలోని టమోటా మార్కె ట్‌ యార్డుల్లో, ముఖ్యంగా ములకలచెరువులో ధరల వెనుక పెద్ద మాయాజాలం సాగుతోంది. మార్కెటింగ్‌ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపారులు, దళారులు ఆడుతున్న నాటకంలో సామాన్య రైతు బలైపోతున్నాడు. గరిష్ట ధర పేరుతో సాగుతున్న ప్రచారం వెనుక వాస్తవాలు పరిశీలిస్తే రైతులకు ఒరుగుతున్న లాభం శూన్యమని స్పష్టమవుతోంది.

రికార్డు ధర.. కేవలం ప్రచారానికే!

ఈ నెల 15న ములకలచెరువు మార్కెట్‌లో కిలో టమోటా రూ. 17 పలికినట్లు సోషల్‌ మీడియాలో భారీగా ప్రచారం చేశారు. పొరుగున ఉన్న మదనపల్లె (రూ.13.50), వాయల్పాడు (రూ.13.60), పుంగనూరు (రూ.11), వి.కోట (రూ.10) కంటే ఇక్కడ ఎక్కువ ధర ఉందంటూ ఊదరగొట్టారు. అయితే, వాస్తవానికి ఈ ధర కేవలం 10 శాతం పంటకు మాత్రమే దక్కింది. మిగిలిన 90 శాతం పంటను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతులను ముంచేశారు. 15 కిలోల క్రేట్ల విధానం అమలు కావడం లేదన్న విమర్శల నుంచి రైతుల దృష్టి మళ్లించడానికే ఈ ‘ధరల అస్త్రాన్ని’ ప్రయోగించినట్లు తెలుస్తోంది.

కాగితాలకే పరిమితమైన ప్రభుత్వ ఆదేశాలు

రైతులు మోసపోకూడదనే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ గతేడాది డిసెంబర్‌ 29న స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.

15 కిలోల క్రేట్‌ విధానం:

25 కిలోల క్రేట్ల స్థానంలో నిర్వహణ సులభంగా ఉండే 15 కిలోల క్రేట్లను ప్రవేశపెట్టాలి.

జాక్‌పాట్‌ దోపిడీకి చెక్‌:

అమ్మకాల సమయంలో ‘జాక్‌పాట్‌’ లేదా ఇతర పేర్లతో అనధికారికంగా డబ్బులు తగ్గించకూడదు.

నిబంధనలు ఇవే:

క్రేట్‌ ఎత్తు వరకు మాత్రమే టమాటాలు నింపాలి. ఐదు అంతస్తుల కంటే ఎక్కువ పేర్చకూడదు. ధరల ప్రదర్శన కోసం ఎలక్ట్రానిక్‌ బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ, ములకలచెరువులో ఇవేవీ అమలు కావడం లేదు. బాక్సుల సైజు పెద్దవిగా ఉంచి, తక్కువ ధరకే ఎక్కువ పరిమాణంలో టమోటాలను వ్యాపారులు దోచుకుంటున్నారు.

‘ములకలచెరువు వద్దు బ్రో..’

ఇక్కడి మోసాలపై రైతులు సోషల్‌ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. ‘ములకలచెరువు చాలా మోసం బ్రో..’ బాక్స్‌ లెవల్‌ అంటారు కానీ బాక్సులు చాలా పెద్దగా ఉంటాయ్ఙి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికంటే కర్ణాటకలోని కోలార్‌, స్థానిక వడ్డిపల్లి, మదనపల్లె మార్కెట్లే నయమని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మార్కెటింగ్‌ అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement