జన్మదిన వేడుకలను అడ్డుకోవడం హేయమైన చర్య
కమలాపురం : మండలంలోని పెద్దచెప్పలిలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు అడ్డుకోవడం హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు సాయినాథ శర్మ ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం పెద్దచెప్పలిలో జరిగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు చించారు. ఇదేమని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగి దాడి చేశారు. దీనిపై స్పందించిన సాయినాథ శర్మ కమలాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసులను అడ్డు పెట్టుకుని పర్మిషన్ లేదని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అడ్డుకోవడం హేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయన్నారు. పెద్దచెప్పలికి మాత్రమే పర్మిషన్ కావాలా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో టీడీపీ నాయకులు చేసే కార్యక్రమాలను ఏనాడైనా అడ్డుకున్నామా? అన్నారు. పోలీస్ పర్మిషన్ తీసుకుని మళ్లీ వెళ్లి వేడుకలు నిర్వహిస్తామన్నారు. కొందరు రాజకీయ నాయకులు పబ్బం గడుపు కోవడం కోసమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు శృంగభంగం తప్పదని టీడీపీ నాయకులు ఇలాంటి ఆటలు సాగిస్తున్నారని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, జడ్పీటీసీ సుమిత్రా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దచెప్పలిలో గత 30 ఏళ్ల నుంచి ఏ పార్టీ కార్యక్రమమైనా అదే సర్కిల్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా జగనన్న జన్మదిన వేడుకలు అదే ప్రాంతంలో నిర్వహిస్తుండగా టీడీపీ నాయకులు వచ్చి ఫ్లెక్సీలు చించడం తగదన్నారు. ఇలాంటి వికృత చేష్టలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు చెన్నకేశవరెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, దేవదానం, జెట్టి నగేష్, దాసరి సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జన్మదిన వేడుకలను అడ్డుకోవడం హేయమైన చర్య


