మహిళ ఆత్మహత్య
చింతకొమ్మదిన్నె : మండలంలోని ఎర్రమాచుపల్లెకు చెందిన బుర్రి లక్ష్మీదేవి (44) బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. కడుపునొప్పి, కాళ్ల నొప్పులు భరించలేక స్థానికంగా ఆర్‌ఎంపీ డాక్టర్ల వద్ద చూపించుకుంటూ వచ్చింది. నయం కాకపోవడంతో బుధవారం రాత్రి ఉరి వేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
చాపాడు : మండల పరిధిలోని ప్రొద్దుటూరు –మైదుకూరు జాతీయ రహదారిలో నాగులపల్లె సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మిండ్యాల శేషాద్రి (18) అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన శ్రీను, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు శేషాద్రి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు నుంచి పల్లవోలుకు బైకులో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శేషాద్రిని స్థానిక వాహనదారులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గుండెపోటుతో
ఏఆర్ ఎస్‌ఐ మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎం.టి. విభాగంలో ఏఆర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న పి.వసంత్ కుమార్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఏఆర్ ఎస్‌ఐ మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఏఆర్ ఎస్‌ఐ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య కడప నగరం భాకరాపేట స్వామి నగర్‌లోని గృహంలో ఉంచిన ఏఆర్ ఎస్‌ఐ భౌతికకాయంపై పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ సోమశేఖర్ నాయక్, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు.
న్యాయ విజ్ఞాన సదస్సు
చింతకొమ్మదిన్నె : కడప నగరం ఇందిరానగర్‌లో ‘నల్సా’ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫక్రుద్దీన్ సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది అక్బర్ అలీ, పారా లీగల్ వలంటీర్లు దశరథ రామిరెడ్డి, శ్రీనివాసులు, నిర్మల, రాజు, ఆశా, అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.
మహిళ ఆత్మహత్య


