విదేశీ బీమా కంపెనీలు వద్దు..స్వదేశీ ఎల్‌ఐసీ ముద్దు
కడప సెవెన్‌రోడ్స్ : బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) దేశ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని, ప్రభుత్వ బీమా రంగ పురోగతికి ఆటంకమని ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. గురువారం కడప బ్రాంచ్ కార్యాలయం ఎదుట ఎల్‌ఐసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధి అవధానం శ్రీనివాస్ అధ్యక్షతన అఖిల పక్ష సంఘాల నిరసన ప్రదర్శనలో ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, లియాఫీ, సీఐటీయూ, ఇతర ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు రఘునాథ్ రెడ్డి, మనోహర్, అజీజ్, నారాయణరెడ్డి, లలిత, జగదీశ్వర్ రెడ్డి, సుధీకర్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు 74 శాతం ఎఫ్‌డీఐ పరిమితి ఉందని, కానీ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదని అన్నారు. మొత్తం బీమా రంగంలో కేవలం 32.67 శాతం మాత్రమే ఎఫ్‌డీఐ వచ్చిందని అన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో కేవలం 4 కంపెనీలు మాత్రమే 74 శాతం పరిమితిని పూర్తిగా వాడుకున్నాయని, మరో 6 ప్రధాన కంపెనీలకు విదేశీ ఈక్విటీ ఏమీ లేదన్నారు. ఇప్పుడున్న 74 శాతం పరిమితి బీమారంగవృద్ధికి అడ్డు కాదని ఇది నిరూపిస్తున్నదని అన్నారు. 100 శాతం ఎఫ్‌డీఐ వస్తే దేశీయ పొదుపులపై విదేశీ కంపెనీల నియంత్రణ పెరుగుతుందని అన్నారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి హానికరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగాల సంఘాల నాయకులు అక్బర్ బాషా, కామనూరు శ్రీనివాసరెడ్డి, వెంకటసుబ్బయ్య, లక్ష్మి దేవి, వారిజాతమ్మ, శ్రీకృష్ణ, ప్రశాంతి, శ్రీనివాసులు, కుమార్, సాదక్ వలీ, గౌస్, వెంకట్రామరాజు, నరసింహారెడ్డి, రామాంజుల్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


