బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు
బి.కోడూరు : బద్వేలు సీనియర్ సివిల్ కోర్టులో మైనర్ బాలిక కిడ్నాప్ కేసుకు సంబంధించి నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్‌ఐ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని అక్కుపాలెం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన కంబగండ్ల ఓబయ్య అలియాస్ నవీన్ 2019 జనవరి ఆరో తేదీన మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అహోబిలం తీసుకెళ్లాడు. దీనిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బి.కోడూరు పోలీసు స్టేషన్‌లో అప్పటి ఎస్‌ఐ ఘనమద్దిలేటి కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సదరు కేసును బద్వేలు సీనియర్ సివిల్ జడ్జి వై.జె.పద్మశ్రీ విచారణ జరిపి ముద్దాయిపై నేర నిరూపణ కావడంతో 5 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.ఎస్.ఆర్.కృష్ణ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సదరు కేసులో సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్న బద్వేలు రూరల్ సీఐ క్రిష్ణయ్య, అప్పటి ఎస్‌ఐ ఘనమద్దిలేటిలతో పాటు కోర్టు కానిస్టేబుల్ రమణ, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ కిషోర్‌కుమార్‌లను జిల్లా ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాధ్ అభినందించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


