● 11 వేల జాబ్‌కార్డుల తొలగింపు
కడప సిటీ: చంద్రబాబు సర్కారు రోజుకో రూల్‌తో ఉపాధి కూలీలను ఇబ్బంది పెడుతోంది. మొన్న కుంటి సాకులు చెబుతూ నిర్దాక్షిణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. నిన్నేమో ప్రత్యర్థి పార్టీ సానుభూతిపరులంటూ ఏకంగా జాబ్ కార్డుల్నే తీసేసింది. తాజాగా ఫొటో క్యాప్చర్ అంటూ కూలీల్లో గుబులు పుట్టిస్తోంది. నిజానికి ఉపాధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులను అందిస్తుంది. కేవలం పది శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. అయినా బాబు సర్కారు పెత్తనం చెలాయిస్తోంది. రోజుకో కొర్రీలు పెడుతూ పేద కూలీల మీద కక్షసాధింపు చర్యలకు దిగుతోంది.
వారికి నిరాశే..
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు సంబంధించి అక్రమాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో ఈకేవైసీ చేస్తోంది. అంటే ప్రతి ఉపాధి హామీ కూలీని ఫొటో క్యాప్చర్ (ఫేస్ రీడింగ్) చేస్తోంది. ఈ విధానం వల్ల ఒకరికి బదులు మరొకరు పనికి వెళ్లేందుకు వీలుండదు. ఉద్దేశం మంచిదే అయినా ఈ ఫోటో క్యాప్చర్ విధానం వల్ల కొంతమందికి ఫేస్ రీడింగ్ కావడం లేదు. ప్రధానంగా కంట్లో శుక్లం ఉన్నవారికి, ఆపరేషన్ చేయించుకున్న వారికి, ఆధార్ అప్‌డేట్ చేయని వారికి ప్రధాన సమస్యగా మారింది. దీంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆప్షన్ లేదు
ఫోటో క్యాప్చర్ కాని వారు ప్రస్తుతానికి పనులు వెళుతున్నారుగానీ, భవిష్యత్తులో జాబ్‌కార్డు ఉంటుందా? లేదా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. వీరికి మాత్రం ఆప్షన్ ఇవ్వకుండా ఉండడంతో మరింత భయాందోళనలో ఉన్నారు. ప్రభుత్వం ఏదో ఒక ఆప్షన్ ఇచ్చి వీరిని కూడా ఈకేవైసీ చేయిస్తే వారి ఆందోళన తగ్గే అవకాశం ఉంది.
జిల్లాలో ఉపాధి హామీ పథకంలో 308387 మంది యాక్టివ్ కూలీలుగా ఉన్నారు. ఇందులో ఈకేవైసీ పూర్తయిన వారు 2,53,792 మంది ఉన్నారు. దీంతో 82.31 శాతం ఈకేవైసీ అయింది. అక్టోబరు 7 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏప్రిల్ 26లోపు ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉంది. ఇదిలా ఉండగా ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన వ్యక్తుల జాబ్‌కార్డులు కావాలని తొలగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు జిల్లాలో 11 వేల జాబ్‌కార్డులు తొలగించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకంపై కూడా తమ ప్రతాపాన్ని చూపుతూ పేద కూలీలపై తన కక్షసాధింపు ధోరణిని కొనసాగిస్తోంది.
● 11 వేల జాబ్‌కార్డుల తొలగింపు
● 11 వేల జాబ్‌కార్డుల తొలగింపు


