అన్నమయ్య కాలిబాట పునరుద్ధరించాలి
కడప సెవెన్‌రోడ్స్ : అన్నమయ్య కాలిబాటను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోమవారం శ్రీ సప్తగిరి గోవిందమాల సేవా సమితి భక్తబృందం కడప నగరంలోని శ్రీ సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద నుంచి కలెక్టరేట్‌కు ప్రదర్శన నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు మల్లెల రామాంజులు, ప్రతినిధులు శ్రీనివాసులురెడ్డి, కేవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గోవిందమాల భక్తులకు వైకుంఠ ఏకాదశి రోజున లేదా ద్వాదశి రోజున ద్వార దర్శనం కల్పించాలని కోరారు. 25 ఏళ్లుగా గోవిందమాల ధరించి కడప నుంచి పాదయాత్రగా అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు వెళుతుంటామన్నారు. ఈ సాంప్రదాయం వందల సంవత్సరాల నుంచి వస్తోందని తెలిపారు. ఈ యేడు అటవీ అధికారులు అన్నమయ్య కాలిబాట ద్వారా వెళ్లకుండా అడ్డుకోవడం తగదన్నారు. అటవీ అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాలిబాట మూసివేయడం సమంజసం కాదన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి కోశాధికారి ఎం.నాగరాజు, మల్లికార్జున, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


