దౌర్జన్యంగా భూమిని కబ్జా చేస్తున్నారు
సుండుపల్లె : భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేసెయ్ అన్న రీతిలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తన భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని బాధితుడు డేరంగుల సతీష్ కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలోని భైరవగుట్ట సమీపంలో సుండుపల్లె గ్రామ సర్వే నెంబర్–426లో తన తాత డేరంగుల కృష్ణయ్య పేరుమీద 3.59 సెంట్ల డీపట్టా భూమి ఉందని తెలిపారు. తమ ఐదుగురు అన్నదమ్ములకు నేటికీ దానిపై సమాన వాటా ఉందన్నారు. అయితే ఇటీవల సుండుపల్లెకు చెందిన ఇద్దరు టీడీపీ ముఖ్య నాయకులు ఆ స్థలం ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమకు హక్కుగా ఉన్న భూమిలో ఫెన్సింగ్ వేసి రాతి కూసాలు వేశారని, భూమిలోకి రావద్దంటూ బెదరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా తమ పలుకుబడి వినియోగించి భయపెడుతున్నారని ఆరోపించారు. పిత్రార్జితంగా సంక్రమించిన భూమికి రక్షణ కల్పించాలని, ఆక్రమణదారుల నుండి తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ విషయమై సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి సంతోష్ నాయక్‌ను చరవాణి ద్వారా వివరణ కోరగా కోర్టు విషయమై వేరే ప్రదేశంలో ఉన్నానని కార్యాలయానికి వచ్చిన తర్వాత సదరు సర్వే నెంబర్ పరిశీలించి వివరాలు తెలుపుతానన్నారు.
రక్షణ కల్పించాలని
పట్టాదారుడి వేడుకోలు


