వ్యాపారుల సిండికేట్... ప్రభుత్వ ఆదాయానికి గండి
చక్రాయపేట : వీరాంజనేయుడి ఆదాయానికి గండి పడింది. టెండరు దారులు సిండికేట్‌గా ఏర్పడి మంకుపట్టు వీడకపోవడంతో అధికారులు వచ్చిన కాడికి అంటూ గత ఏడాది కంటే తక్కువ మొత్తానికి కట్టబెట్టేశారు. గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో గత ఏడాది కొబ్బరికాయల విక్రయానికి వేలం నిర్వహించగా రూ.80 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది టెండరు వేంపల్లెకు చెందిన నాగరాజు రూ.73,35,000కు దక్కించుకున్నారు. టెండరు దారులు సిండికేట్‌గా ఏర్పడి రూ.50 లక్షలకు మించి తమకు వద్దని భీష్మించుకు కూర్చోవడంతో కాసేపు చర్చ సాగింది. అయితే అనధికారికంగా రూ.60కి అమ్ముకోవచ్చునంటూ అధికారులు హామీ ఇవ్వడంతోనే ఆయనకు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ఏడాది కొబ్బరికాయల విక్రయం టెండర్ రూ.80 లక్షలకు దక్కించుకోగా.. జీఎస్టీతో కలిపి రూ.94 లక్షలు చెల్లించాలి. అయితే టెండరు దారుడు తనకు నష్టం వస్తోందని జీఎస్టీ చెల్లించలేదు. పైగా రూ.35 టెంకాయలు తెచ్చి రూ.60కి విక్రయించారు. దీనిపై భక్తులు పలుమార్లు అధికారులను విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఏడాది కూడా 30 నుంచి 35 సెంటీమీటర్లు గల టెంకాయ రూ.35కు అమ్మాలని అధికారులు నిబంధన పెట్టారు. అయితే జీఎస్టీ ఊసే ఎత్తలేదు. దీంతో టెండరు దారులు మార్కెట్‌లోనే రూ.40నుంచి రూ.45 ఉంటే రూ.35కే ఎలా అమ్మాలంటూ ఎదురుప్రశ్నలు వేశారు. పోటీకి ఎవరూ రాకపోవడంతో మూడు పర్యాయాలు వాయిదా వేశారు. చివరికి ఆలయ వర్గాలు మెట్టు దిగి పూజా సామగ్రితో కలిపి రు.42కు అమ్ముకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. అయినా ఎవరూ ముందుకురాలేదు. చివరకు రూ.60కు అమ్మవచ్చునని అనధికారిక హామీ రావడంతో అందరూ సిండికేట్‌గా మారి నామ మాత్రంగా పాడుతూ రూ.75,35,000లకు ముగించేశారు. నాగరాజుకు హక్కు కల్పించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. దీంతో గత ఏడాది కంటే తక్కువగా టెండరు పాడడం.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడడం జరిగిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ కార్యాలయ అధికారి భారతి, మాజీ ఛైర్మన్లు వీరభాస్కరుడు, వెంకటస్వామి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు.
గత ఏడాది కంటే తక్కువగా
రూ.75 లక్షలకే అప్పగించేశారు


