జీజీహెచ్ కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తాం
కడప అర్బన్ : కడప జిజిహెచ్(రిమ్స్)లో పనిచేస్తున్న శానిటేషన్, సూపర్‌వైజర్‌లను తొలగిస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అన్నారు. ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఆప్కాస్ జిల్లా అధ్యక్షుడు పవన్, రిమ్స్ నాయకులు ఏసన్న ,రాజమ్మ, పెంచలమ్మ, విజయలతో కలిసి రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్‌ఎస్.వెంకటేశ్వరరావును మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కడప ఆస్పత్రిలో ఈ నెల ఒకటో తారీఖు నుంచి పద్మావతి శానిటేషన్ వర్కర్స్ కాంట్రాక్ట్ వారు పనులు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు, సూపర్‌వైజర్లను తొలగిస్తామని యాజమాన్యం తరఫున సురేష్ చెప్పడం సరికాదన్నారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మ్యాన్ పవర్ ఎక్కువ కావాలనుకుంటే కొత్తవారిని తీసుకోవాలేగానీ, గతంలో పని చేసే వారిని తొలగిస్తే ఉద్యమిస్తామన్నారు. ఎంఓయూ ప్రకారం కార్మికులకు వేతనాలు మంజూరు చేయాలని, పీఎఫ్ ,ఈఎస్‌ఐ ప్రతి నెలా సక్రమంగా చెల్లించాలన్నారు. కార్మికులకు వీక్లీ ఆఫ్‌లు, సెలవులు తప్పనిసరిగా మంజూరుచేయాలని కోరారు. లేబర్ ఆక్ట్‌కు భిన్నంగా వేతనాలు ఇస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, బాలాజీ రావు, సీపీ.రమణ, శానిటేషన్ కార్మికులు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. అనంతరం సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాసులుకు విన్నవించగా ఆయన స్పందిస్తూ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఎవరిని తొలగించవద్దని మౌఖికంగా తెలియజేశామని పేర్కొన్నారు.


